రాజధాని పేరుతో విధ్వంసం | The destruction in the name of capital | Sakshi
Sakshi News home page

రాజధాని పేరుతో విధ్వంసం

Published Wed, Oct 28 2015 2:08 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

రాజధాని పేరుతో విధ్వంసం - Sakshi

రాజధాని పేరుతో విధ్వంసం

♦ అమరావతి అత్యాశాపూరిత నిర్మాణం.. బీబీసీ కథనం
♦ ఎన్జీటీ అభ్యంతరాలు బేఖాతరు చేస్తున్నసర్కారు
♦ ఏడాదికి మూడు పంటలు పండే భూముల్లో నిర్మాణాలు
♦ కోటికి పైగా వృక్షాలను నరికివేయాల్సి వస్తుందని ఆందోళన
 
 సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట శాపమే తప్ప వరం కాదని ప్రఖ్యాత బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ చానల్ (బీబీసీ)వెబ్ సైట్లో సంచలన కథనం ప్రచురించింది. భారతదేశం గర్వపడేలా, ప్రపంచం అసూయపడేలా రాజధాని నిర్మిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని నిర్ణయించే ముందు తప్పనిసరిగా జరపాల్సిన పర్యావరణ మదింపు జరపలేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అభ్యంతరం వ్యక్తంచేసినప్పటికీ బేఖాతరు చేస్తూ ముందుకు సాగుతున్నారని ఆక్షేపించింది. అమరావతి నిర్మాణానికి ఈనెల 22వ తేదీ విజయదశమి రోజున ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయగా 24వ తేదీన బీబీసీ ఈ కథనాన్ని ప్రచురించడం గమనార్హం. ఈ కథనంలోని వివరాలిలా ఉన్నాయి...

 అత్యాశాపూరిత నిర్మాణం...
 రాష్ట్ర విభజనలో హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్లిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే నూతన రాజధాని అమరావతి కోసం వేసిన ప్రణాళికలు అత్యాశాపూరితంగా ఉన్నాయని బీబీసీ కథనంలో పేర్కొంది. రాజధాని నిర్మాణంకోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూసేకరణ బిల్లు ప్రయోగించకుండా వివాదాస్పదంగా భూసమీకరణ చేపట్టారు.

రానున్న పదేళ్లలో 7,500 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో దేశంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మిస్తామన్నారు. అందుకోసం సింగపూర్ సహాయం తీసుకుంటామని చెప్పారు. అయితే రాజధాని నిర్మాణానికి సహాయం చేస్తుందంటున్న సింగపూర్ నగరంకంటే అమరావతి పదిరెట్లు పెద్దదనే విషయం గుర్తించాలని కథనంలో ప్రస్తావించారు. రాజధాని నిర్మాణాన్ని చాలామంది సవాలుగా భావిస్తే, తానొక మంచి అవకాశంగా భావించానని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ... అందుకోసం ఆయన అనుసరిస్తున్న చర్యలపై చాలామంది సంతృప్తిగా లేరని బీబీసీ వ్యాఖ్యానించింది.

 ఏకపక్ష వైఖరిపై రైతుల ఆగ్రహం
 అమరావతి పేరుతో తమ జీవితాలతో ఆడుకుంటున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని బీబీసీ కథనంలో స్పష్టంగా పేర్కొంది. ‘‘చంద్రబాబు మా జీవితాలను పణంగా పెట్టి కార్పొరేట్లకు, వ్యాపారవేత్తలకు మేలు చేయాలని చూస్తున్నారు. అందుకోసం దేశంలో అత్యంత సారవంతమైన, ఏడాదికి మూడు పంటలు పండే పచ్చని వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. ముఖ్యమంత్రి తన పాత వైఖరిలోనే కొందరికి మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని రైతు నాయకుడు మల్లెల హరీంద్రనాథ్ చౌదరి తీవ్రంగా దుయ్యబట్టారు. అంతేకాకుండా రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాజధానికోసం తమ భూములిచ్చేలా తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని పలువురు రైతులు కూడా పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రదర్శనలు నిర్వహించకూడదంటూ ఆంక్షలు విధించి ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని వారు ఆరోపించారు. అయితే రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, కొందరు అభివృద్ధి నిరోధకులు రాజకీయ కారణాలతోనే విమర్శిస్తున్నారని ఆరోపణలను ముఖ్యమంత్రి కొట్టివేసినట్లు బీబీసీ పేర్కొంది.

 పర్యావరణానికి చేటు
 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భారీ స్థాయిలో తలపెట్టిన అమరావతి నగర నిర్మాణం పర్యావరణం పాలిట పెనువిపత్తుగా మారుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నట్లు బీబీసీ కథనంలో పేర్కొంది. ఇంత భారీస్థాయిలో నిర్మాణాలు తలపెట్టినప్పుడు పర్యావరణపరంగా తీసుకోవాల్సిన ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదని పర్యావరణవేత్తలు తెలిపారు. రాజధాని పరిసర ప్రాంతాల్లోని 20వేల హెక్టార్ల అటవీ భూమిని డీనోటిఫై చేయమని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంపట్ల వారు మరింత ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేంద్రం అందుకు అనుమతినిస్తే రాష్ట్ర ప్రభుత్వం రానున్న కొద్ది నెలల్లో కోటికి పైగా వృక్షాలను నరికివేయనుందని, ఇది పర్యావరణం పాలిట శాపంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం తాము తీసుకున్న భూమికి రెట్టింపు... అంటే 40 వేల హెక్టార్లలో అడవులను పెంచాల్సి ఉంటుంది. అలాగే తాము నరికిన చెట్లకు రెట్టింపు స్థాయిలో వృక్షాలను పెంచాల్సి ఉంటుంది. అలా చేయకపోతే అది అటవీ పరిరక్షణ చట్టాన్ని అతిక్రమించడమే’’నని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అటవీ అధికారి చెప్పారు. ‘‘అడవులను వెంటనే నరికేస్తారు. కానీ మొక్కలను వృక్షాలుగా పెంచాలంటే దశాబ్దాలు పడుతుంది. అలాగే అడవుల్లోని జీవ వైవిధ్యాన్ని నాశనం చేసి... టేకు, యూకలిప్టస్, వేప, ఎర్రచందనంలాంటి మొక్కలను నాటుతారు.

అప్పుడు అడవులను నమ్ముకుని జీవించే జంతువులు, పక్షులు, కీటకాల పరిస్థితి ఏమి టి? నీటివనరులు, చిన్న చిన్న చెట్లు, మొక్కలు ఎలా బతుకుతాయి?’’ అని ఆ అధికారి ప్రశ్నించారు. ‘‘మేము అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం కాదు. కానీ అందుకోసం అనుసరిస్తున్న అన్యాయ మార్గానికి వ్యతిరేకం. ఇది ప్రజారాజధాని కాదు, కాంట్రాక్టర్ల రాజధాని’’ అని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించినట్లు బీబీసీ కథనంలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement