నీటి శాఖకు నిధుల మళ్లింపు | The diversion of funds to the Ministry of Water | Sakshi
Sakshi News home page

నీటి శాఖకు నిధుల మళ్లింపు

Published Sat, Nov 21 2015 2:35 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

నీటి శాఖకు నిధుల మళ్లింపు - Sakshi

నీటి శాఖకు నిధుల మళ్లింపు

సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు పేరుతో తెలంగాణ సర్కారు రాష్ట్ర వార్షిక ఆర్థిక ప్రణాళికను పక్కదారి పట్టిస్తోందా..? బడ్జెట్ మౌలిక సూత్రాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన సమగ్ర అభివృద్ధి భావనలకు భిన్నంగా కొత్త ప్రయోగానికి తెర లేపిందా..? అరవై ఏళ్లుగా ఉన్న బడ్జెట్ పద్దులను ఇష్టారాజ్యంగా నీటిపారుదల శాఖకు అనుకూలంగా మలుస్తోందా? 2016-17 బడ్జెట్‌కు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటకీ ఒకే పద్దు కింద రూ.25 వేల కోట్లు కేటాయించేందుకు సర్కారు తీసుకున్న నిర్ణయం ఈ సందేహాలకు తావిస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు, నిపుణులందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

 నేరుగా నిధుల కేటాయింపు
 సీఎం కేసీఆర్ సారథ్యంలో శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటి పారుదల శాఖ, ఆర్థికశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.  ప్రాజెక్టుల వారీగా కాకుండా.. ఒకే పద్దు కింద నీటి పారుదల శాఖకు నిధులివ్వాలని ఈ సందర్భంగా ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు తన ప్రతిపాదనను లేవనెత్తారు. ఒకే పద్దు కింద చెల్లించాలంటే.. అకౌంటెంట్ జనరల్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఏజీ ఆమోదిస్తే ఇచ్చేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర బదులిచ్చినట్లు తెలిసింది. కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేందుకు అనువుగా బడ్జెట్ కేటాయింపులను నేరుగా నీటి పారుదలశాఖ ఖర్చు పెట్టేలా కొత్త విధానం రూపొందించాలని,  ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నందున పనులను బట్టి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయకు ఆ నిధుల చెల్లింపు జరపాలని సీఎం అధికారులను ఆదేశించటం గమనార్హం. దీంతో 5 నిమిషాల్లోనే ఈ సమావేశం ముగిసింది.

 సమావేశానికి ఏజీ డుమ్మా
 ముందుగా ప్రకటించిన మేరకు సీఎం సమీక్ష సమావేశానికి అకౌంటెంట్ జనరల్ హాజరు కావాల్సి ఉంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా గంపగుత్తగా నిధులను ఒకే పద్దుపై కేటాయించే కొత్త విధానంపై చర్చించాలనే అజెండాను చూసి ఏజీ ముందు రోజే  ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. బడ్జెట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా.. ఒక శాఖ ఇష్టాయిష్టంగా ఖర్చు చేసేలా ఈ కొత్త సంప్రదాయమేమిటనీ ఏజీ కార్యాలయం ఆర్థిక శాఖను ఆరా తీసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం సమావేశానికి ఏజీ హాజరు కాకపోవటం.. ఎందుకు రాలేదని సీఎం ఆరా తీయటం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అప్పటికప్పుడు ఏజీతో ఫోన్‌లో మాట్లాడారు. సచివాలయానికి రప్పించి సీఎంతో సమావేశమయ్యేలా చూశారు.

ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తోచ్‌వాంగ్, అకౌంటెంట్ జనరల్ లతా మల్లికార్జున్ సీఎంను కలుసుకున్నారు. వచ్చే ఏడాది బడ్జెట్ రూపకల్పనకు తీసుకుంటున్న చర్యలు, నీటి పారుదల శాఖకు నేరుగా బడ్జెట్ కేటాయింపులు చేసే విషయాన్ని వీరి వద్ద సీఎం ప్రస్తావించారు. రాత పూర్వకంగా ప్రతిపాదన పంపించాలని ఏజీలు సీఎంకు చెప్పినట్లు తెలిసింది.

 కొత్త విధానం వివాదాస్పదం
 సాగునీటి ప్రాజెక్టులకు వార్షిక బడ్జెట్‌లో వేలాది కోట్లు కేటాయించటం కొత్తేమీ కాదు. విడివిడిగా ప్రాజెక్టులు, ప్రాంతాల వారీగా నిధులను కేటాయించాల్సి ఉంటుంది. కానీ అదేమీ పట్టనట్లుగా ఇరిగేషన్ శాఖకు రూ.25 వేల కోట్లు అని గంపగుత్తగా కేటాయించటం ప్రజాస్వామ్యంలో మంచి సంప్రదాయం కాదని, ఇది బడ్జెట్ స్ఫూర్తికే విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తీరుగా నాలుగు శాఖలకు భారీ పద్దులు ఇస్తే.. బడ్జెట్ రూపకల్పనకు అర్థమే మారిపోతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సాగుతున్న ప్రాజెక్టులన్నీ ఒప్పందం మేరకు జరుగుతున్నవే. ఏ ఏడాది ఎంత మేరకు పని చేయాలి.. ఎంత కాలంలో పూర్తి చేయాలనేది ఒప్పందంలో స్పష్టంగా ఉంటుంది. దీంతో ఏ ప్రాజెక్టుకు ఈ ఏడాది ఎన్ని నిధులు కావాలో అంచనా వేయటం సులభం. కానీ తమకు నిధులిస్తే.. తర్వాత ఖర్చులు వెల్లడిస్తాం అన్నట్లుగా ఇరిగేషన్ విభాగం చేస్తున్న వాదన బడ్జెట్ స్ఫూర్తిని కాలరాస్తోందంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement