
ఆ కేసులు కక్షపూరితం
బాధ్యులను వదలి.. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతపైతప్పుడు కేసులా?
ఇదెక్కడి న్యాయమని వైఎస్‌ఆర్‌సీపీ ధర్మాగ్రహం
సర్కారు తీరుపై నిరసనలతో విరుచుకుపడిన పార్టీశ్రేణులు
ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ యాజమాన్యాన్ని, సిబ్బందిని.. పోస్టుమార్టం లేకుండానే డ్రైవర్ మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించిన అధికారులను వదిలేశారు.. ఇదేమిటని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతపై మాత్రం కక్ష సాధిస్తున్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. సర్కారు పాల్పడుతున్న ఈ కక్షపూరిత చర్యలపై గురువారం వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. నల్లబ్యాడ్జీలు ధరించి.. నోటికి నల్లగుడ్డలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశాయి. విశాఖ నగరం, జిల్లావ్యాప్తంగా ధర్నాలు, మానవహారాలు, మౌన ప్రదర్శనలతో సర్కారుపై ధర్మాగ్రహం వ్యక్తం చేశాయి. తమ నేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావం ప్రకటించాయి.
విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు సర్కార్ అక్రమ కేసులు బనాయించడంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. పదకొండు మంది ప్రాణాలను బలిగొన్న దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా.. ఇదేమిటని ప్రశ్నించిన జననేతపై కక్ష పూరితంగా కేసులు నమోదు చేయడంపై మండిపడింది. ప్రతిపక్ష నాయకుడు పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు జీవీఎంసీ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో నిరసనలతో హోరెత్తి పోయింది. నియోజక వర్గ కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శనలు నిర్వహించారు. నాలుగు రోడ్ల జంక్షన్‌లో మానవహారాలుగా ఏర్పడి నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించారు. బనాయించిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలంటూ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డాబాగార్డెన్ జంక్షన్‌లో జరిగిన నిరసనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తి పోశారు. అదే విధంగా నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన నిరసనల్లో కూడా పార్టీ కో ఆర్డినేటర్లు ప్రభుత్వ నిరంకుశ పాలనపై నిప్పులు చెరిగారు.
విశాఖ తూర్పులో..
విశాఖ తూర్పు కో ఆర్డినేటర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆరిలోవలో నిరసన ప్రదర్శన చేశారు. నోటికి నల్లబ్యాడ్జీలు కట్టుకుని పీఐసీ పాయింట్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు ప్రదర్శనగా వెళ్లి అక్కడ మానవహారం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొన్న విశాఖ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై జగన్‌ను అడ్డుకున్నారని..నేడు ఇదేమిటని ప్రశ్నించినందుకు జగన్‌పై తప్పు డు కేసులు పెట్టారని వంశీకృష్ణ ఆరోపించా రు. ఎస్సీసెల్ నగర కన్వీనర్ బోని శివరామకృష్ణ, నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్తి మం దారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి ఎ.రాజబాబు, నగర కార్యదర్శులు ఇ మ్మంది సత్యనారాయణ, పీఐ బాలరాజు, వైదా నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ పశ్చిమలో..
విశాఖ పశ్చిమ పార్టీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో మల్కాపురం ప్రకాష్ నగర్‌లో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేశారు. గడిచిన మూడేళ్లుగా ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పట్ల చంద్రబాబు సర్కార్ అవలంబిస్తున్న వైఖరిపై ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని..అందువలనే జగన్‌పై కేసులు బనాయిస్తూ చంద్రబాబు వికృతంగా ప్రవర్తిస్తున్నారని మళ్ల విజయప్రసాద్ ఆరోపించారు. ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ బద్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ ఉత్తరంలో...
విశాఖ ఉత్తర కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఆధ్వర్యంలో సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తొలుత బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. అనంతరం వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి ప్ల కార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. తక్షణమే కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌యాదవ్, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, సంస్కృత విభాగం నగర కన్వీనర్ రాధ, గిడ్డంకుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణా రెడ్డి, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు బర్కత్ అలి, యువజన విభాగం కార్యదర్శి రెయ్యి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ దక్షిణంలో..
విశాఖ దక్షిణ కో ఆర్డినేటర్ కోలా గురువులు ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ ఎల్‌ఐసీ భవనం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రమాదంలో మృతి చెందిన 11మందికి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నా«థ్ మాట్లాడుతూ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి వెళ్లిన శాసనసభ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రభుత్వం అక్రమకేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ప్రచార కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మాసిపోగు రాజు, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
గాజువాకలో...
గాజువాక కో ఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో వందడుగుల రోడ్డులో మౌనప్రదర్శన చేశారు. వందడుగుల రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నాచేశారు. కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం ఇచ్చారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. ఈసందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్‌తో కలిసి జగన్‌పై అక్రమ కేసులు బనాయించిన చంద్రబాబు నేడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని మరోసారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అదే విధంగా స్టీల్‌ప్లాంట్‌లో పొట్టి శ్రీరాములు కూడలి వద్ద వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తానప్ప ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పార్టీ కో ఆర్డినే
టర్ తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. పెందుర్తిలో..
పెందుర్తి కో ఆర్డినేటర్ అన్నంరెడ్డి అదీప్‌రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టా్టరు. పెందుర్తి బీఆర్‌టీఎస్ రహదారి నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దారు పాండురంగారెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా అదీప్‌రాజు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్ నడుపుతూ పదిమంది ప్రాణాలు తీసిన ట్రావెల్స్ యాజమాన్యాన్ని వదిలిపెట్టి బాధితులకు అండగా నిలబడిన జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు సర్కారు దిగజారుడుతనానికి ఇది నిదర్శనమన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి గొర్లె రాము నాయుడు, మండల అధ్యక్షులు నక్కా కనకరాజు, తుంపాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
భీమిలిలో..
భీమిలి, ఆనందపురం మండలాల్లో పార్టీ మండల కమిటీల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. భీమిలి పట్టణాధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఇక్కడ జిల్లా అధికార ప్రతినిధి ఎస్.కరుణాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.