
'వర్మ సినిమాలే హత్యలకు ప్రేరేపించాయి'
నెల్లూరు: సినిమాల్లో చూపించే మంచికన్నా చెడునే ఎక్కువగా ప్రభావితం చేస్తాయనేది ఇదో ఉదాహరణ. వివరాల్లోకి వెళితే... సెట్ అప్ బాక్సుల రిపేర్, ఆధార్ అనుసంధానం పేరుతో ఇళ్లలోకి వెళ్లి మహిళలను, వృద్ధులను సుత్తితో క్రూరంగా హత్యలు చేస్తూ పోలీసులకు పట్టుబడిన కరుడుగట్టిన నేరస్తుడు కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ అలియాస్ వెంకీకి దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలే హత్యలకు ప్రేరేపించాయని విచారణలో వెల్లడించాడు.
పట్టపగలు నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కు రోడ్డులో శనివారం మహిళను హత్యచేసి, మరో ఇద్దరిపై హత్యాయత్నం చేసిన వెంకటేశ్వర్లును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. నిందితుడు నెల్లూరు జిల్లా కొండాపూరం మండలం ఎర్రబొట్లపల్లి వాసి. గతంలో నెల్లూరులో పలు దారుణాలకు పాల్పడింది అతనేనని విచారణలో తేలింది. రాంగోపాల్ వర్మ అంటే అభిమానమని, అతడు తీసిన ప్రతి సినిమా లెక్కకు మించి చూసేవాడని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అందులోని కొన్ని ఘటనలు ఊహించుకుని నెల్లూరు జిల్లాలో నలుగురి ప్రాణాలు అతి కిరాతకంగా బలి తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.