మందుల్లో మాయాజాలం
-
నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లు
-
నాసిరకం ఇంజక్షన్ ఘటనతో బహిర్గతం
-
బినామీ పేర్లతో ఎంజీఎం సిబ్బంది టెండర్లు
-
రెండో రోజూ ఔషధ నియంత్రణాధికారుల తనిఖీలు
ఎంజీఎం : మందుల కొనుగోలులో మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి(ఎంజీఎం) సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. బినామీ పేర్లతో కాంట్రాక్టర్లుగా మారి నిబంధనలకు విరుద్ధంగా మందులను కొనుగోలు చేస్తూ భారీగా దండుకుంటున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో సరఫరా కోసం స్థానికంగా కొనుగోలు చేసిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యాంపిల్స్ (క్రిమిసంహారక నియంత్రణ ఔషధం) నాసిరకమైందని తెలియడంతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఔషధ నియంత్రణాధికారులు మంగళవారం కూడా ఎంజీఎం ఆస్పత్రిలోని ఔషధాల విభాగంలో తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా కొనుగోలు చేసిన మరికొన్ని శాంపిల్స్‌ను సేకరించారు. ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే రోగులకు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి మందులను సరఫరా చేస్తుంటారు. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌లో మందుల లభ్యత లేనప్పుడు అత్యవసర బడ్జెట్ నిధులతో టెండర్ ప్రక్రియ ద్వారా స్థానికంగా కొనుగోలు చేసి రోగులకు మందులను సరఫరా చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో మందులు అందుబాటులో లేనప్పుడు 804 రకాల ఔషధ కంపెనీల డ్రగ్స్‌ను మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ, స్టోర్స్ విభాగంలో తిష్ట వేసిన అధికారులు తమ అనుభవాన్ని ప్రదర్శిస్తూ నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. క్రిమిసంహారక రసాయనాలు సేవించి వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే వారి కోసం ప్రాలీ డాక్సైమ్ క్లోరైడ్ యాంపిల్స్‌ను వినియోగించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఎంజీఎం ఔషధ విభాగంలోని సిబ్బంది మాత్రం నిబంధనలు పట్టించుకోకుండా స్థానికంగా లభ్యమయ్యే ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యాంపిల్స్‌ను కొనుగోలు చేశారు. సిబ్బంది ఇష్టప్రకారం కొనుగోలు చేసిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యాంపిల్ నాసిరకమైనదని వైద్య సిబ్బంది గుర్తించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ మందుల కొనుగోలులో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన విషయం బయటికిరాకుండా ఔషధ విభాగం సిబ్బంది అన్ని రకాలుగా ప్రయత్నించారు. సెంట్రల్ డ్రగ్స్ నుంచే వీటిని కొనుగోలు చేసినట్లుగా చూపించే ప్రయత్నం చేశారు. సోమవారం ఉదయం అసలు విషయంలోకి వెలుగులోకి వచ్చింది. ఇదే రకంగా ఆస్పత్రి స్టోర్స్ విభాగం సిబ్బంది, కొందరు వైద్య సిబ్బంది తీరుతోనే ఇలా నాసిరకం మందులను ఎంజీఎంలో కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
బినామీ పేర్లతో టెండర్లు
ఎంజీఎం ఆస్పత్రికిSమందులు సరఫరా చేస్తున్న ఏజెన్సీలలో ఎక్కువగా ఆస్పత్రి సిబ్బందిలోని కొందరు బినామీ పేర్లతోనే నడుస్తున్నాయని తెలుస్తోంది. ఎంజీఎం సిబ్బందిలో కొందరు.. టెండరు నిబంధనల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని తమ కుటుంబ సభ్యుల పేర్లతో ఏజెన్సీలను నమోదు చేసి మందుల సరఫరా కాంట్రాక్టులను దక్కించుకుంటున్నారు. లాభం ఎక్కువగా వచ్చే మందులను సరఫరా చేస్తున్నారు. ఇవి నాసిరకమైనవిగా నిర్ధారణ జరుగుతున్నాయి. దీంతో ఎంజీఎంకు వచ్చే పేద రోగుల ప్రాణాలకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.