రాష్ట్ర పునర్నిర్మాణానికి వరం
-
‘సాగర్’కు పూర్వవైభవం
-
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
నిజాంసాగర్:
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్ర పునర్నిర్మాణానికి వరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల్లో నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుతుందన్నారు. ప్రాజెక్టును మంత్రి శనివారం పరిశీలించారు. అధికారులను ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, ప్రాజెక్టు నీటిమట్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన జలాశయాలు నిండాయన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు సింగూరు నుంచి 60వేల క్యూసెక్కులు, హల్దీవాగు నుంచి 30వేలు, ఘనపురం ఆనకట్ట నుంచి 25వేలు, పోచారం నుంచి 25వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందన్నారు. కొన్నేళ్ల తర్వాత పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటున్న ప్రాజెక్టును పరిశీలించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే హన్మంత్‌సింధే, జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, నాయకులు వినయ్‌కుమార్, దుర్గారెడ్డి, గంగారెడ్డి, నార్ల సురేశ్, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ గంగాధర్, ఈఈ సత్యశీలారెడ్డి తదితరులున్నారు.