నదుల అనుసంధానం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే ప్రథముడంటూ కేంద్రమంత్రి ఉమాభారతి అవాస్తవిక ప్రకటనలు చేయడం సరికాదని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు.
కాకినాడ: నదుల అనుసంధానం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే ప్రథముడంటూ కేంద్రమంత్రి ఉమాభారతి అవాస్తవిక ప్రకటనలు చేయడం సరికాదని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ వాస్తవ విరుద్ధంగా మాట్లాడడం సరికాదని విమర్శించారు. ఈ మేరకు ఉమాభారతికి లేఖ రాశారు. నదుల అనుసంధానంలో చంద్రబాబును పొగుడుతూ ఆమె చేసిన ప్రకటనను తప్పుపట్టారు. కృష్ణ-పెన్నా నదుల అనుసంధానికి 1978లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తరువాత చిత్రావతి-కుందు-పెన్నా నదుల నీరు కృష్ణ నీటిలో సోమశిల-కాండ్లేరు-పోతిరెడ్డిపాడు ద్వారా చేరుతున్న విషయాన్ని ఉమాభారతి దృష్టికి తీసుకెళ్ళారు.
పోతిరెడ్డిపాడును అప్పటి ముఖ్యమంత్రి జలగం ప్రారంభించగా, తరువాత ఎన్.టి.రామారావు హయాంలో కొనసాగించారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తి చేశారని వివరించారు. పోలవరం కుడికాలువ పనులను దాదాపు 130 కిలోమీటర్ల పొడవు, 86 మీటర్ల లోతుతో వైఎస్సార్ ప్రారంభించిన విషయాన్ని కూడా వివరించారు. కృష్ణ-గోదావరి అనుసంధానం బ్రిటిష్ హయాంలోనే పూర్తయిందని పేర్కొన్నారు. వాస్తవాలను మరుగున పెట్టి ఇటువంటి ప్రకటనలు చేయడం కేంద్రమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా మానుకోవాలని సూచించారు.