టోకెన్లు ఇచ్చి భోజనం లేదన్నారు
Published Tue, Jan 24 2017 10:52 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
* మార్కెట్ యార్డులో మూణ్నాళ్ల ముచ్చటైన ఉచిత భోజన పథకం
* రహదారిపై బైఠాయించి రైతుల ఆందోళన
కొరిటెపాడు (గుంటూరు): మార్కెట్ యార్డులో రైతులకు ఉచిత భోజన పథకం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, మార్కెటింగ్ అధికారులు ఈనెల 20వ తేదీన అట్టహాసంగా పథకాన్ని ప్రారంభించారు. అయితే అన్నదాతలకు టోకెన్లు ఇచ్చి, భోజనం పెట్టకపోవడంతో మంగళవారం యార్డులో గందరగోళం నెలకొంది. టోకెన్లు తీసుకొన్న రైతులు భోజనం పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి మిర్చి రైతులు భారీ స్థాయిలో గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం మిర్చి బస్తాలను తీసుకు వచ్చారు. అమానత్ పట్టీల ఆధారంగా యార్డు సిబ్బంది వారందరికీ ఉచిత భోజనం టోకెన్లు పంపిణీ చేశారు. మిర్చి బస్తాలను విక్రయించి భోజన హాలు దగ్గరకు వెళ్ళే సరికి భోజనం అయిపోయిందని చెప్పడంతో రైతులు ఆగ్రహించి యార్డు బయటకు వచ్చి నరసరావుపేట రోడ్డులో బైఠాయించి రాస్తారోకో చేశారు. సుమారు గంట పాటు రాస్తారోకో, ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా పలువురు మిర్చి రైతులు మాట్లాడుతూ ఉదయం 11 గంటల నుంచి క్యూలో నిలబడితే భోజనం అయిపోయిందని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై రైతులను దోచుకుతింటున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు, పాలకవర్గం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. భోజనం పెట్టకపోగా రైతుల పట్ల యార్డు సిబ్బంది హేళనగా మాట్లాడటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, కార్యదర్శి ఎం.దివాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని ఇక మీదట యార్డులో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని, రైతులందరికీ భోజనం అందించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
Advertisement