
ఆ దొంగలు పట్టుబడ్డారిలా...
చోరీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఇద్దరు యువకులు అనూహ్యంగా పోలీసులకు దొరికిపోయారు.
సికింద్రాబాద్: చోరీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఇద్దరు యువకులు అనూహ్యంగా పోలీసులకు దొరికిపోయారు. ఉత్తర మండలం డీసీపీ ప్రకాష్‌రెడ్డి, అదనపు డీసీపీ వై.గిరి కథనం ప్రకారం...ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన కోన ఉమామహేశ్ (24) మల్కాజిగిరి మీర్జాల్‌గూడలో, ఆర్జి నవీన్‌కుమార్ (28) బాలాజీనగర్ యాప్రాల్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ జల్సాలకు అలవాటు పడ్డారు. తాళం వేసి ఉన్న గృహాలను టార్గెట్ చేసుకుని రాత్రి వేళల్లో తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డారు. తాజాగా నగరంలోని కార్ఖానా, తుకారాంగేట్, బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్లలో ఐదిళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. లోగడ సైతం వీరు ఖమ్మం జిల్లా కొత్తగూడెం, నగరంలోని కార్ఖానా, తిరుమలగిరి ప్రాంతాల్లో జరిగిన దొంగతనాల్లో నిందితులుగా ఉన్నారు. వారి నుంచి 86 గ్రాముల బంగారు, 56 గ్రాముల వెండి ఆభరణాలు, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డారిలా...
ప్రేమ వివాహం చేసుకుని భర్తను వదిలేసిన మీనా అనే యువతితో వారిద్దరికి పరిచయం ఏర్పడి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. మీనా ద్వారా ఆమె కుటుంబ సభ్యులు ఏవన్ నిందితుడు కోన ఉమామహేష్‌కు పరిచయం అయ్యారు. క్రమేణా వారితో పరిచయం పెంచుకున్న ఉమామహేష్ మీనా అక్క కూతురు (వివాహిత)తో అక్రమ సంబంధం నెరిపాడు. కొద్ది రోజుల క్రితం ఆమెను తీసుకుని రహస్య ప్రదేశంలో వివాహం చేసుకున్నాడు. తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారని మీనా సోదరి పోలీసులను ఆశ్రయించింది. ఈ కోణంలో దర్యాప్తు చేసిన తుకారాంగేట్ పోలీసులు నిందితుల అసలు గుట్టు రట్టు చేశారు. మీనాను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.