
ముగ్గురిని మింగిన చెరువు
చెల్లిని కాపాడబోయి అక్క.. నీట మునిగిపోతున్న ఇద్దరు బిడ్డలను రక్షించే క్రమంలో తల్లిసహా ముగ్గురు చెరువులో పడి మృత్యువాత పడ్డారు.
వెంకటాపురం: చెల్లిని కాపాడబోయి అక్క.. నీట మునిగిపోతున్న ఇద్దరు బిడ్డలను రక్షించే క్రమంలో తల్లిసహా ముగ్గురు చెరువులో పడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం విజయపురికాలనీలో సోమవారం జరిగింది. విజయపురి కాలనీకి చెందిన ఉయిక కోమలి(35) భర్త రామారావు, ఇద్దరు కుమార్తెలను వెంట బెట్టుకొని సోమవారం మిరపతోటకు వెళ్లింది. అనంతరం దుస్తులు ఉతికేందుకు కుమార్తెలను తీసుకొని చెరువు వద్దకు వెళ్లింది.
ఆమె దుస్తులు ఉతుకుతుండగా పక్క నే ఆటలాడుకుంటున్న మూడో కుమార్తె శృతి(6) ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయింది. పెద్ద కుమార్తె లహరి(15) గమనించి చెల్లిని పట్టుకునేందుకు చెరువులోకి దిగింది. ఆమె కూడా మునిగిపోతూ కేకలు వేసింది. బిడ్డలను కాపాడేందుకు తల్లి కూడా చెరువులో దిగింది. ప్రమాదవశాత్తు ముగ్గురూ నీటమునిగి మృతి చెందారు. ఎంతకూ భార్యాపిల్లలు తిరిగి రాకపోవడం తో రామారావు వెళ్లి చెరువులో వెతకగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యూయి.
నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు
కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో సోమవారం ఈత కోసం వెళ్లి నీట మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మండలంలోని ఎత్తోండ క్యాంపునకు చెందిన బసప్ప కుమారుడు రమేశ్(14), పండరి కుమారుడు రంజిత్ (14) స్థానిక జడ్పీహెచ్‌ఎస్‌లో 9వ తరగతి చదువుతున్నారు. సోమవారం క్యాంపు సమీపంలోని గుంతలోని నీటి లో ఈత కోసం వెళ్లారు. ఇద్దరూ నీటిలో మునిగిపోవడంతో సమీపంలోని కూలీలు గమనించి వచ్చి వారిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే రమేశ్ మృతి చెందాడు. రంజిత్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో బసప్ప దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. పండరికి ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు రంజిత్.