‘విరాట్’పై ఆశలు !
►ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్చలు
►రూ.300 కోట్లకు తగ్గనున్న పెట్టుబడి భారం
►మూలకుద్దులో ఏర్పాటుకు నిర్ణయం
విశాఖపట్నం: విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విరాట్‌పై అడుగంటిపోయిన ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. విరాట్ విశాఖలో ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధనౌకగా గుర్తింపు పొందిన ఈ విరాట్ నేవీ సేవల నుంచి గత ఏడాది నిష్క్రమించింది. దీనిని రాష్ట్రానికి కేటాయించాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. దీనిని విశాఖ తీరంలో మ్యూజియం కం స్టార్ హోటల్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో ఆ మొత్తాన్ని భరించలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీనికవసరమయ్యే నిధులను కేంద్రం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విన్నపానికి అటు నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో విరాట్ విశాఖలో ఏర్పాటు సాధ్యం కాదని తేలిపోయింది.
మళ్లీ కదలిక
నేవీలో మూడు దశాబ్దాల పాటు సేవలందించి ఇటీవలే విరమణ పొందిన టీయూ–142 యుద్ధ విమానాన్ని మ్యూజియంగా ఏర్పాటుచేయడానికి గత శనివారం విశాఖకు తీసుకొచ్చినప్పుడు మళ్లీ విరాట్‌పై కదలిక వచ్చింది. పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీకాంత్ ఈ విరాట్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుకు సమగ్రంగా వివరించారు. ప్రస్తుత అంచనాలకంటే మూడు వంతుల నిధులు తగ్గేలా ఈ విరాట్ ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని సీఎంకు వివరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖలో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు గురువారం పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్, ప్రాంతీయ డైరెక్టర్ శ్రీరాములునాయుడు, ఇతర అధికారులు ఢిల్లీ పయనమయ్యారు. సాయంత్రం కేంద్ర పర్యాటకశాఖ కార్యదర్శి ఎన్‌కే సిన్హా నేతృత్వంలోని అధికారులతో సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా ప్రతిపాదనలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా కొన్ని మార్పులు చేర్పులు చేయడం, అనవసర వ్యయాన్ని తగ్గించడం వంటì అంశాలను కేంద్ర అధికారులకు వివరించారు.
వ్యయం రూ.300 కోట్లకు కుదింపు
ఈ ప్రాజెక్టు వ్యయం రూ.300 కోట్లు సరిపోతుందన్న అంచనాకు వచ్చారు. ఇందుకవసరమయ్యే సొమ్ములో కొంత కేంద్ర ప్రభుత్వం భరించాలని కోరారు. దీనిపై అటు నుంచి స్పష్టమైన హామీ రాకపోయినా ప్రతికూలంగా మాత్రం స్పందించలేదు. మరోవైపు రాష్ట్రానికి చెందిన పట్టణాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖల నుంచి కొంత నిధులను సమీకరించాలన్న నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది. దీనిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. త్వరలోనే డీపీఆర్‌లకు సంబంధించి టెండర్లు పిలవనున్నారు. తాజాగా ఈ విరాట్‌ను భీమిలి మండలం మూలకుద్దులో ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. అక్కడ సుమారు 500 ఎకారాల్లో స్పెషల్ టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ ఆర్‌డీ శ్రీరాములునాయుడు గురువారం రాత్రి ఢిల్లీ నుంచి ‘సాక్షి’కి చెప్పారు. అటు కేంద్రం కొంత ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇటు అంచనా వ్యయం తగ్గించడంతో విరాట్ విశాఖలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.