బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన వెంకన్న ఆలయం
వెంకన్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నేడు
Published Sun, Oct 2 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
– రేపు సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేషవాహనం, సీఎం పట్టువస్త్రాలు సమర్పణ
– సర్వం సిద్ధం చేసిన టీటీడీ
– ఉత్సవాల్లో 3500 వేల మంది సిబ్బందితో బందోబస్తు
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమమోక్తంగా ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. ఇందులో భాగంగా నేటి సాయంకాల వేళలో విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమి పూజ’(మత్సంగ్రహణం)తో మట్టిని సేకరించి ఛత్రచామర మంగళవాద్యాలతో ఊరేగుతూ తిరిగి ఆలయంలోనికి చేరుకుంటారు. యాగశాలలో ఆ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో(కుండలు)– శాలి, వ్రహి,యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలతో అంకురార్పణం (బీజావాపం) చేస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దిన దినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు.
రేపు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బుధవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల్లోపు మీన లగ్నంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తారు. అనంతరం రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప దర్శనమివ్వనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో జి.శ్రీనివాస్ సర్వం సిద్దం సిద్దం చేశారు. బ్రహ్మోత్సవాల్లో మొత్తం 3500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు సిద్దం చేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ జె.ప్రభాకరరావు, తిరుపతి అర్బన్‌జిల్లా జయలక్ష్మి తిరుమలలోనే ఉంటూ ఉత్సవాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
రేపు శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ
బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబునాయుడు సోమవారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 7.30 నుండి 8 గంటల మధ్య బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలను శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి సమర్పించి స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు దంపతులు పెద్ద శేషవాహనసేవలో ఉత్సవమూర్తిని దర్శించుకోనున్నారు.
Advertisement
Advertisement