
నేడే లక్కీ డే
నిర్మల్‌రూరల్/ఆదిలాబాద్: మద్యం దుకాణాల లక్కీ డ్రాకు సమయం ఆసన్నమైంది. దరఖాస్తు చేసుకున్న వ్యాపారుల్లో ఎవరిని అదృష్టం వరించనుందో శుక్రవారం తెలిసిపోతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు ఎవరూ ఊహించని స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ నెల 13 నుంచి వారం రోజులపాటు నిర్వహించిన దరఖాస్తుల ప్రక్రియలో చివరి రోజు వెయ్యికిపైగా దరఖాస్తులు రావడం గమనార్హం. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 160 మద్యం దుకాణాలకు ఏకంగా 2,372 దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జనార్దన్‌రెడ్డి గార్డెన్, నిర్మల్‌లో స్టార్‌ఫంక్షన్‌హాల్, కుమురం భీం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం, మంచిర్యాల జిల్లాలో పద్మావతి గార్డెన్‌లో మద్యం టెండర్లకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్నారు. జిల్లాలో రెండేళ్ల కాలపరిమితితో దుకాణం దక్కించుకున్న వారు 2019 సెప్టెంబర్ 30 వరకు మద్యం అమ్మకాలు సాగించవచ్చు.
9.30 గంటలకే హాజరుకావాలి..
శుక్రవారం లక్కీ డ్రాకు హాజరయ్యే మద్యం వ్యాపారులు ఉదయం 9.30 గంటలకే రావాలని అధికారులు చెబుతున్నారు. వ్యాపారులకు ఎంట్రిపాస్ ఉంటేనే అనుమతిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ల సమక్షంలో ఉదయం 11 గంటలకు మొదటి లక్కీ విజేతను ప్రకటిస్తారు. ఏజెన్సీ వ్యాపారులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాల్సి ఉంది. దుకాణం దక్కించుకున్న వ్యాపారులు 1/6 వంతు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల ద్వారా రూ.20.37 కోట్ల ఆదాయం ఎక్సైజ్‌శాఖకు అదనంగా వచ్చింది. భారీ ఎత్తున దరఖాస్తులు రావడం, దరఖాస్తు ఫీజు నాన్‌రిఫరండేబుల్‌గా ఉండడంతో ఈ ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్‌లోని షాప్‌నెంబర్ 4కు అత్యధికంగా 75 దరఖాస్తులు రాగా, ఆ తర్వాతి స్థానంలో బెజ్జూర్ 70, గత మద్యం పాలసీ 2015–17 సంవత్సరంలో కూడా ఉమ్మడి జిల్లాలో బెజ్జూర్‌కు 75 దరఖాస్తులతో మొదటిస్థానంలో నిలవడం గమనార్మం. తాళ్లపల్లి షాప్‌నెంబర్ 1, 2 దుకాణాలకు సింగిల్ దరఖాస్తులే రాగా, మంచిర్యాలలోని సింగపూర్ షాప్‌నెంబర్ 1, 3, తాళ్లగుర్జాల, దండేపల్లి దుకాణాలకు రెండేసి దరఖాస్తులు వచ్చాయి.