
జంట జలాశయాలకు సందర్శకుల తాకిడి
మొయినాబాద్: జంట జలాశయాలకు ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. ఆరేళ్ల తరువాత గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్ జలాశయాల్లో జలకళ సంతరించుకోవడంతో కొత్తనీటి కళకళలు చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలి వచ్చారు.
2010లో గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండడంతో నీటిని దిగువకు వదిలారు. అప్పట్లో జలాశయాలను చూసేందుకు సందర్శకులు భారీగా వచ్చారు. జలాశయాల కట్టలపై నుంచి కొత్తనీటిని చూస్తూ.. జలాశయం అందాలను సెల్‌ఫోన్‌లలో బందిస్తూ.. సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. పది రోజులకు పైగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయాల్లోకి వరదనీరు పోటెత్తింది. గండిపేట జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 1,779 అడుకులకు చేరింది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.5 అడుగులు కాగా 1,743 అడుగులకు చేరింది. ఈసీ వాగులో భారీగా వరద వచ్చింది. దీంతో సోమవారం ఉదయానికి మరో రెండు అడుగులకు పైగా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులు తెలిపారు.