నిబంధనలు విధిగా పాటించాల్సిందే
నెల్లూరు (క్రైమ్) : వాహనదారులు విధిగా నిబంధనలు పాటించాల్సిందేనని లేకపోతే చర్యలు తప్పవని ట్రాఫిక్ డీఎస్పీ నిమ్మగడ్డ రామారావు ఆటోడ్రైవర్లను హెచ్చరించారు.
-
గ్రామీణ ప్రాంత ఆటోలు నగరంలోకి నిషేధం
-
ట్రాఫిక్ అవగాహన సదస్సులో డీఎస్పీ
నెల్లూరు (క్రైమ్) : వాహనదారులు విధిగా నిబంధనలు పాటించాల్సిందేనని లేకపోతే చర్యలు తప్పవని ట్రాఫిక్ డీఎస్పీ నిమ్మగడ్డ రామారావు ఆటోడ్రైవర్లను హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ఏబీఎం కాంపౌండ్‌లో ఆటో, సిటీ బస్సు డ్రైవర్లకు ట్రాఫిక్ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ రామారావు మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన అన్నీ చర్యలు చేపట్టామన్నారు. నిర్దేశిత ప్రాంతాల్లోనే ఆటోలు, సిటీ బస్సులు నిలపాలన్నారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఆటోడ్రైవర్లు విధిగా వాహనాలకు సంబంధించిన పత్రాలను, డ్రైవింగ్ లైసెన్సులను తమ వద్ద ఉంచుకోవాలన్నారు. తనిఖీల సమయంలో వాటిని అధికారులకు చూపించాలని, లేకుంటే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టామని, అందులో భాగంగా గ్రామీణ ప్రాంత ఆటోలను నగరంలోకి నిషేధించామన్నారు. కొన్నిచోట్ల ఇష్టానుసారంగా నడిరోడ్లపైనే స్టాండ్లు పెడుతున్నారని, దీని వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. ఆటోస్టాండ్లు రోడ్డుకు దూరంగా ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. మెరుగైన ట్రాఫిక్‌ను అందించేందుకు తాము తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో నార్త్ ట్రాఫిక్ ఎస్‌ఐలు సీహెచ్ కొండయ్య, టి.మాలకొండయ్య, ఆర్‌ఎస్‌ఐలు జి. శ్రీహరిరెడ్డి, ఎం. కృష్ణయ్య, ఆటో, సిటీబస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.