కళ్యాణ మంటపం వద్ద ఉన్న రిసెప్షన్ ఆహ్వాన డెకరేషన్
పెళ్లింట విషాదం అలుముకుంది. పట్టణ సమీపంలో బైపాస్‌రోడ్డు పక్కనే ఉన్న హంద్రీనీవా ప్రధాన కాల్వలో మంగళవారం పుష్కరస్నానానికి వెళ్లిన పెళ్లికుమారుడు తమ్ముడు, బామ్మర్ది గల్లంతైన విషయం తెలిసిందే.
–హంద్రీనీవా కాలువలో గల్లంతైన విద్యార్థుల్లో ఒకరి మృతదేహం లభ్యం
– మరొకరి కోసం కొనసాగుతున్న గాలింపు
– శోక సంద్రంలో కుటుంబసభ్యులు
పత్తికొండ టౌన్: పెళ్లింట విషాదం అలుముకుంది. పట్టణ సమీపంలో బైపాస్‌రోడ్డు పక్కనే ఉన్న హంద్రీనీవా ప్రధాన కాల్వలో మంగళవారం పుష్కరస్నానానికి వెళ్లిన పెళ్లికుమారుడు తమ్ముడు, బామ్మర్ది గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో ఒకరు బుధవారం శవమై కనిపించారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్లితే..
పత్తికొండ పట్టణం తేరుబజారులో ఆర్టిస్టు మోహన్‌రాజు నివాసమంటున్నాడు. ఇతని అన్న బ్రహ్మనందరాజు కడప జిల్లా బద్వేలులో స్థిరపడ్డాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటిభార్య కుమారుడు రవికుమార్ హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌లో నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతని వివాహం ఈనెల 21న కడపలో నిర్వహించారు. బంధువులంతా పత్తికొండలో ఉండటంతో తిరుగు పెళ్లి సోమవారం చిన్నాన మోహన్‌రాజు ఇంట్లో నిర్వహించారు. మంగళవారం ఉదయం పుష్కరాలు చివరి రోజు కావడంతో బ్రహ్మనందరాజు రెండోభార్య కుమారుడు ఇంటర్‌ఫస్టియర్ చదువుతున్న పామూరు జ్ఞానేశ్వర్‌రాజు 16), రాజంపేటకు చెందిన మోహన్ చెల్లెలు వాణి కుమారుడు ఇంటర్ సెంకడియర్ చదువుతున్న అవధానం తేజస్వరూప్(17) హంద్రీనీవా ప్రధాన కాల్వకెళ్లి స్నానాలు చేస్తుండగా నీటి ప్రవాహం అధికమై అందులో కొట్టుకోపోయారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు గాలించినా జాడ దొరకలేదు. బుధవారం ఉదయం నుంచే సీఐ బీవీ విక్రంసింహ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, పలువురు యువకులు కాలువ వెంబడి గాలింపు చేపట్టారు. కాలువ దిగువలో రెండు, మూడుచోట్ల అడ్డంగా వలలను కట్టించారు. బుధవారం మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో తేజస్వరూప్ మతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
కనిపించని జ్ఞానేశ్వర్ జాడ:
హంద్రీనీవా కాలువలో ఎంత వెతికినా పామూరు జ్ఞానేశ్వర్‌రాజు జాడ దొరకలేదు. బంధువులు కాలువగట్టు వద్దనే బుధవారం రాత్రి వరకు గాలించారు. జ్ఞానేశ్వర్‌రాజు అనంతపురంలో విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేసే ఈ విద్యార్థి తండ్రి బ్రహ్మనందరాజు కొన్నేళ్లక్రితం అనారోగ్యంతో మతిచెందగా, తల్లి విజయ అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు నీటిలో కొట్టుకోపోవడంతో ఆమె దుఃఖసాగరంలో మునిగిపోయారు.
శోకసంద్రంలో తేజ కుటుంబం
వైఎస్‌ఆర్ కడప జిల్లాలో టీచర్‌గా పనిచేస్తున్న అవధానం చలపతిరాజు, వాణి దంపతులకు ఇద్దరు కుమారులు తేజస్వరూప్, విష్ణుస్వరూప్. పెద్దవాడైన తేజస్వరూప్ ప్రస్తుతం నెల్లూరులోని నారాయణ కళాశాలలో ఇంటర్(ఎంపీసీ) సెకండియర్ చదువుతున్నాడు. ఫస్టియర్‌లో 470కు 467 మార్కులు తీసుకొచ్చాడు. ఇంతటి ప్రతిభ గల కుమారుడు పుష్కరస్నానానికి వెళ్లి మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు, బంధువులు శోఖసంద్రంలో మునిగిపోయారు.