
సరదా తెచ్చిన తంటా
వేంపల్లె(ఇడుపులపాయ) :
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి సరదాగా రైలింగ్ (మెట్ల వద్ద రక్షణగా వేసిన స్టీల్ పైపులు)పై జారుతుండగా.. ప్రమాదవశాత్తు నాల్గవ అంతస్తు నుంచి జారిపడి ప్రాణం మీదకు తెచ్చుకొన్నాడు. తలకు తీవ్ర గాయాలై పరిస్థితి విషమించడంతో తిరుపతి రమాదేవి ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇడుపులపాయ జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కోనఅనంతపురం సుగాలి తాండాకు చెందిన రామయ్య నాయక్ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పీ–2 (ఇంటర్‌సెకండియర్) పూర్తి చేసుకొని ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదివేందుకు సిద్ధమయ్యాడు.
ఈ నేపథ్యంలో పాత క్యాంపస్ నుంచి కొత్త క్యాంపస్‌లో ఈ విద్యార్థులకు గదులు కేటాయించారు. బ్లాక్–1లో ఉన్న భవనంలో రామయ్య నాయక్ రెండవ అంతస్తులో తోటి విద్యార్థులతో ఉన్నాడు. మంగళవారం రాత్రి 10గంటల సమయంలో నాల్గవ అంతస్తులో ఉన్న స్నేహితులను కలిసేందుకు అక్కడికి వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో సరదాగా మెట్లకు రక్షణగా వేసిన స్టీల్ పైపులపై(రైలింగ్) జారుతూ గదికి చేరుకోవాలనుకున్నాడు. పైపులపై జారే ప్రయత్నంలో చేతిలో పుస్తకాలు ఉన్నందువల్ల అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అధికారులు స్థానిక ట్రిపుల్ ఐటీ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అక్కడ చేర్చుకొనేందుకు నిరాకరించడంతో తిరుపతిలోని రమాదేవి ఆసుపత్రిలో చేర్పించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.