రాజ్యసభ సభ్యుడిగా డీఎస్!
► అధికార పార్టీ అభ్యర్థిగా ఖరారు
► చక్రం తిప్పిన ఎంపీ కల్వకుంట్ల కవిత
► బీసీ నేతగా ప్రతిపాదన ఓకే అన్న సీఎం కేసీఆర్
► నేడో, రేపో అధికారిక ప్రకటన
నిజామాబాద్: సీనియర్ రాజకీయ నేత, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) రాజ్యసభలో కాలు మోపనున్నారు. 32 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనకు రాజ్యసభ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. సీనియర్ రాజకీయ వేత్త, వెనుకబడిన వర్గాలకు చెందిన నేతకు రాజ్యసభలో అవకాశం కల్పించేందుకు ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన ప్రయత్నం ఫలించింది. రెండు రాజ్యసభ స్థానాల కోసం టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు సీనియర్ నేతలు పోటాపోటీగా ప్రయత్నం చేసిన క్రమంలో జిల్లాకు చెందిన డీఎస్‌కు అవకాశం రావడం కోసం ఎంపీ కవిత చేసిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర రాజకీయాలలో అనుభవం ఉన్న నాయకుడు రాజ్యసభలో టీఆర్‌ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందన్న ఆమె ఆలోచనను పార్టీ అధిష్టానం బలపరిచింది. ఈ మేరకు ప్రస్తుతం ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న డి.శ్రీనివాస్ పేరు రాజ్యసభకు ఖరారు కాగా... నేడో, రేపో అధికారికంగా ప్రకటన వెలువడనుందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
24న నోటిఫికేషన్
రాజ్యసభ ఎన్నికల కోసం ఈ నెల 24న నోటిఫికేషన్ వెలువడనుండగా.. అంతకంటే ముందగానే ఇద్దరు అభ్యర్థులను ప్రకటించే పనిలో టీఆర్‌ఎస్ అధిష్టానం ఉంది. రోజులు గడిచిన కొద్దీ ఆశావహుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల పేర్లను తేల్చే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంపీ కవిత రెండు రోజులుగా జిల్లాకు చెందిన డీఎస్ పేరును సీఎం కేసీఆర్ వద్ద ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ పెద్దల సభలో ఓ సీనియర్ నేతగా డీఎస్‌కు అవకాశం కల్పిస్తే.. బీసీ వర్గాలకు కూడ ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీ ముఖ్యులు, జిల్లా ప్రజాప్రతినిధులతో సమాలోచనల మీదట డీఎస్ అభ్యర్థిత్వంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన డీఎస్.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడ ఢిల్లీ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన డీఎస్, అప్పటి నుంచే కేసీఆర్‌తో సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో ఆయనకు అన్నమాట ప్రకారం కేసీఆర్ ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా కల్పించారు. ఆ పదవీకాలం ఇంకా మూడు నెలలు ఉండగానే రాజ్యసభకు డీఎస్ పేరును ఖరారు చేయడం చర్చనీయాంశం అవుతోంది.
అంచెలంచెలుగా..
1982లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన డీఎస్.. 32 ఏళ్ల ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1982 వరకు వేల్పూరు సహకార బ్యాంకులో అధికారిగా పనిచేసిన డీఎస్ అదే సంవత్సరం రాజకీయ రంగంలోకి అరంగేట్రం చేశారు. 1983లో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారిగా బరిలోకి దిగిన ఆయన మొత్తం ఎనిమిది పర్యాయాలు ఎమ్మెల్యేగా వివిధ ప్రాంతాల నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట, కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.1985లో జరిగిన ఉప ఎన్నికలకు దూరంగా ఉన్న డీఎస్ 1989, 1994లో ఓటమి చెందినా... 1999, 2004లలో ఎమ్మెల్యేగా వరుస విజయాలను సాధించారు.
2011 అక్టోబర్‌లో శాసనమండలి సభ్యునిగా ఎన్నికై 2015 మార్చి వరకు శాసనమండలి కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తిరిగి అవకాశం కల్పించకపోవడంతో చివరకు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామన్న సీఎం కేసీఆర్.. అదే ప్రకారం డీఎస్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. మరో మూడు నెలల్లో పదవీకాలం ముగియనున్న తరుణంలో.. రాజ్యసభ సభ్యునిగా అవకాశం దక్కనుండటం అరుదైన అవకాశంగా పార్టీవర్గాలు చర్చించుకుంటున్నాయి. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయనకు ఎంపీగా అవకాశం దక్కనుండగా.. నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందన్న వార్త పట్ల డీఎస్ శిబిరంలో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.