ద్విచక్రవాహనాలు ఢీ : ఒకరి మృతి
ఇరగవరం : ద్విచక్రవాహనాలు రెండు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఇరగవరం మండలం రేలంగి శివారు రేలంగి –మండపాక పుంత రోడ్డులో సోమవారం ఉదయం జరిగింది. ఇరగవరం ఏఎస్సై ఐ.నాగేంద్ర కథనం ప్రకారం.. అత్తిలికి చెందిన బొర్రా శ్రీకృష్ణ(43) తణుకులోని వై.జంక్షన్ వద్ద ఉన్న హెయిర్ ఇండస్ట్రీస్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం అతను ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తుండగా, అదే సమయంలో ఎదురుగా వస్తున్న దువ్వ గ్రామానికి చెందిన నేకూరి ప్రసాద్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని స్థానికులు తణుకులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు చీర్ల రాధయ్య ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఘటనా స్థలం తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు మధ్యలో ఉండడంతో పోలీసుల్లో గందరగోళం నెలకొంది. ఆ ప్రాంతం ఇరగవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తుందని రాధయ్య చెప్పడంతో ఎట్టకేలకు సుమారు రెండు గంటల తర్వాత ఇరగవరం పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. మృతుడు బొర్రా శ్రీకృష్ణ కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని బోరున విలపించారు. చీర్ల రాధయ్య వారిని ఓదార్చి సంతాపం తెలిపారు. శ్రీకృష్ణకు భార్య సత్యవతి , కుమారులు వికాస్, వర్ధన్ ఉన్నారు. మృతుడు సోదరుడు బొర్రా వీరభద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు. రోడ్డు పక్కనున్న పొలాల్లో గడ్డికి నిప్పంటించడం వల్ల పొగ మార్గంపై కమ్ముకుందని, ఎదురుగా వస్తున్న వాహనాలు కని పించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.