మరణంలోన వీడని బంధం
- రోడ్డు ప్రమాదంలో మామా, అల్లుడి దుర్మరణం
- మరొకరికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
- బైక్‌పై వెళ్తుండగా స్కార్పియో ఢీకొన్న ఫలితం
మరణంలోన వీడని బంధం నిజమే. దానికి బంధాలు.. అనుబంధాలతో పని లేదు. ఎవరిని ఎప్పుడు ఎలా ఏ రూపంలో కబళిస్తుందో అంతుబట్టదు. ఇప్పుడు అదే జరిగింది. బైక్‌పై బయలుదేరిన మామా అల్లుడ్ని స్కార్పియో రూపంలో మృత్యువు కబళించింది. ఒకేసారి ఇద్దర్ని బలిగొంది. దీంతో రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది.
- సోమందేపల్లి (పెనుకొండ)
హైదరాబాద్ - బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిలోని సోమందేపల్లి మండలం పేటకుంట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోరంట్ల మండలం బెల్లాలచెరువుకు చెందిన అంజనరాజు(32), అతని మామ రాము(50) దుర్మరణం చెందగా, జానకిరాముడు(30) తీవ్రంగా గాయపడ్డారు. పైన పేర్కొన్న ముగ్గురూ కలసి బైక్‌లో సోమందేపల్లికి బయలుదేరగా తమిళనాడు రాష్ట్రం తిరువూరుకు చెందిన స్కార్పియో వాహనం అనంతపురం వైపు వస్తూ బైక్‌ను వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో బైక్ డివైడర్‌ను ఢీకొని 20 అడుగుల దూరంలోకి దూసుకెళ్లింది. ఘటనలో అంజనరాజు అక్కడికక్కడే మరణించగా, రామును బెంగళూరుకు తరలిస్తుండగా మృతి చెందినట్లు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు. జానకిరాముడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
మామను వదిలొద్దామని బయలుదేరి...
సోమందేపల్లికి చెందిన రాము చేనేత కార్మికుడు. తన కుమార్తె శిరీషను ఏడాదిన్నర కిందట అంజనరాజుకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె పుట్టింటికి వచ్చింది. సొంత పనిపై బెల్లాలచెరువుకు వెళ్లిన రాము అక్కడ పని ముగించుకుని సోమందేపల్లికి బయలుదేరాడు. దీంతో మామను ఇంట్లో వదిలి, తరువాత తన భార్యను పిల్చుకొద్దామని భావించిన అంజనరాజు మామతో పాటు జానకిరాముడుతో కలసి బైక్‌లో బయలుదేరారు. ఊహించని విధంగా మార్గమధ్యంలో స్కార్పియో రూపంలో మృత్యువు మామా అల్లుడ్ని మృత్యు ఒడికి చేర్చింది. ఒకేసారి ఇద్దరిని కోల్పోయిన ఆ కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. కాగా అనంతరాజుకు 7 నెలల బాబు ఉన్నాడు.