somandepalli
-
ఊరటనిచ్చిన వాన
జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం ఒకే రోజు 25.9 మి.మీ భారీ సగటు నమోదు ఖరీఫ్ పంటలకు ఉపశమనం ప్రత్యామ్నాయం, పాడి, పట్టు, పండ్లతోటలకు మేలు అనంతపురం అగ్రికల్చర్: వరుణుడు కరుణించాడు. మూడు నెలలుగా మొహం చాటేసిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు ప్రభావం చూపించాయి. దీంతో జిల్లాలోని 63 మండలాల్లోనూ వర్షం కురిసింది. అలాగే ఒకే రోజు 25.9 మి.మీ భారీ సగటు వర్షపాతం కావడం ఈ ఖరీఫ్‌లో మొదటి సారి కావడం గమనార్హం. జూన్, జూలైలో దెబ్బతీసిన వర్షాలు ఆగస్టులో ఓ మాదిరి వర్షాలతో ఆశలు రేకెత్తించగా ఇపుడు కొన్ని మండలాల్లో భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ పంటలకు స్వల్పంగా నష్టం జరిగినా...ఈ వర్షం జిల్లాకు చాలా ఊరటనిచ్చిందని రైతులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తమ్మీద జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు 236 మి.మీ గానూ 227 మి.మీ వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ పంటలకు నష్టం భారీ వర్షాలు కురిసిన మండలాల్లో కొంతవరకు పంట నష్టం వాటిల్లింది. పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామంలో రైతు వెంకటనారాయణకు చెందిన 4 ఎకరాల మిరప తోట నీటమునగడంతో రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లింది. రొద్దం మండలంలో హంద్రీ–నీవా కాలువ తెగిపోవడంతో సమీపంలో మూడు ఎకరాల కర్భూజా, రెండు ఎకరాల్లో ఆముదం, ఒక ఎకరా మిరప తోట నీటిమునగడంతో రూ.6 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. రాయదుర్గం మండలం నాగిరెడ్డిపల్లి చెరువుకు గండిపడటంతో సమీపంలో ఉన్న పంటలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఇక బెళుగుప్ప మండలం శీరిపిచెరువు, పెనుకొండ మండలం అడదాకులపల్లి చెరువులోకి రెండు మూడు నెలలకు సరిపడా వర్షపు నీరు చేరినట్లు సమాచారం. విడపనకల్లు మండలం గడేకల్లు చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరింది. చాలా మండలాల్లో లోతట్లు ప్రాంతాలు జలమయం కాగా, వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహించాయి. చెక్‌డ్యాంలు, నీటికుంటలు జలకళను సంతరించుకున్నాయి. అక్కడక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి. తలుపుల మండలం బట్రేపల్లి జలపాతం కనువిందు చేస్తున్నట్లు తెలుస్తోంది. పంటలకు ఊరట జూన్, జూలైలో అరకొర తేమకు వేసిన వేరుశనగ, కంది, ఆముదం, ప్రత్తి, మొక్కజొన్న లాంటి పంటలకు ఈ వర్షాలు మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ఆగస్టు, ప్రస్తుతం వేస్తున్న పెసర, అలసంద, ఉలవ, జొన్న లాంటి ప్రత్యామ్నాయ పంటలకు ఈ వర్షం ఊరటనిచ్చిందంటున్నారు. అంతేకాకుండా ఎండుతున్న లక్షలాది ఎకరాల పండ్లతోటలు, పట్టు (మల్బరీ) తోటలకు కూడా మేలు జరుగుతుంది. ప్రస్తుతం 26.50 మీటర్ల మేర భారీగా క్షీణించిన భూగర్భజలాలు అక్కడక్కడ కొద్దిగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మండలం నమోదైన వర్షపాతం (మి.మీ) సోమందేపల్లి 71.6 పెద్దపప్పూరు 69.5 ధర్మవరం 67.1 బత్తలపల్లి 67.2 పెనుకొండ 61.7 తాడిపత్రి 59.1 విడపనకల్లు 58.2 బుక్కపట్నం 47.9 రామగిరి 43.8 అమడగూరు 43.6 పుట్లూరు 42.1 ముదిగుబ్బ 40.3 చెన్నేకొత్తపల్లి 37.7 హిందూపురం 37.3 వజ్రకరూరు 36.2 పెద్దవడుగూరు 36.2 గుంతకల్లు 34.5 డి.హిరేహాళ్ 33.8 గాండ్లపెంట 33.6 కణేకల్లు 32.3 అగళి 32 రొద్దం 31.7 చిలమత్తూరు 30.9 కదిరి 30.5 నల్లమాడ 30.4 తాడిమర్రి 30.3 పరిగి 29.9 ఓడీ చెరువు 28.5 కొత్తచెరువు 26 కనగానపల్లి 25 నార్పల 24.5 ఉరవకొండ 20.9 గుత్తి 20.6 కంబదూరు 18.3 తలుపుల 18 గోరంట్ల 16.9 శింగనమల 16.6 పామిడి 16.2 బొమ్మనహాళ్ 15.4 రొళ్ల 15.2 బెళుగుప్ప 14.9 కూడేరు 14.8 రాప్తాడు 13.8 నల్లచెరువు 13.1 యాడికి 12.8 పుట్టపర్తి 11.8 -
మరణంలోన వీడని బంధం
- రోడ్డు ప్రమాదంలో మామా, అల్లుడి దుర్మరణం - మరొకరికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం - బైక్‌పై వెళ్తుండగా స్కార్పియో ఢీకొన్న ఫలితం మరణంలోన వీడని బంధం నిజమే. దానికి బంధాలు.. అనుబంధాలతో పని లేదు. ఎవరిని ఎప్పుడు ఎలా ఏ రూపంలో కబళిస్తుందో అంతుబట్టదు. ఇప్పుడు అదే జరిగింది. బైక్‌పై బయలుదేరిన మామా అల్లుడ్ని స్కార్పియో రూపంలో మృత్యువు కబళించింది. ఒకేసారి ఇద్దర్ని బలిగొంది. దీంతో రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. - సోమందేపల్లి (పెనుకొండ) హైదరాబాద్ - బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిలోని సోమందేపల్లి మండలం పేటకుంట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోరంట్ల మండలం బెల్లాలచెరువుకు చెందిన అంజనరాజు(32), అతని మామ రాము(50) దుర్మరణం చెందగా, జానకిరాముడు(30) తీవ్రంగా గాయపడ్డారు. పైన పేర్కొన్న ముగ్గురూ కలసి బైక్‌లో సోమందేపల్లికి బయలుదేరగా తమిళనాడు రాష్ట్రం తిరువూరుకు చెందిన స్కార్పియో వాహనం అనంతపురం వైపు వస్తూ బైక్‌ను వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో బైక్ డివైడర్‌ను ఢీకొని 20 అడుగుల దూరంలోకి దూసుకెళ్లింది. ఘటనలో అంజనరాజు అక్కడికక్కడే మరణించగా, రామును బెంగళూరుకు తరలిస్తుండగా మృతి చెందినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. జానకిరాముడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. మామను వదిలొద్దామని బయలుదేరి... సోమందేపల్లికి చెందిన రాము చేనేత కార్మికుడు. తన కుమార్తె శిరీషను ఏడాదిన్నర కిందట అంజనరాజుకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె పుట్టింటికి వచ్చింది. సొంత పనిపై బెల్లాలచెరువుకు వెళ్లిన రాము అక్కడ పని ముగించుకుని సోమందేపల్లికి బయలుదేరాడు. దీంతో మామను ఇంట్లో వదిలి, తరువాత తన భార్యను పిల్చుకొద్దామని భావించిన అంజనరాజు మామతో పాటు జానకిరాముడుతో కలసి బైక్‌లో బయలుదేరారు. ఊహించని విధంగా మార్గమధ్యంలో స్కార్పియో రూపంలో మృత్యువు మామా అల్లుడ్ని మృత్యు ఒడికి చేర్చింది. ఒకేసారి ఇద్దరిని కోల్పోయిన ఆ కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. కాగా అనంతరాజుకు 7 నెలల బాబు ఉన్నాడు. -
ఊపిరాడక.. మృత్యువాత
సోమందేపల్లి (పెనుకొండ) : సోమందేపల్లి ఇందిరానగర్‌లో వడ్డే తిప్పన్న(47) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి శనివారం మృతి చెందినట్లు అతని సోదరుడు అశోక్ తెలిపారు. ఇంటి నుంచి బయటకు బయలుదేరగా.. ఆరగడుగుల లోతు కలిగిన నీటి గుంతలో కాలుజారి పడిపోయినట్లు వివరించారు. ఆ తరువాత ఊపిరి ఆడక మృతి చెందినట్లు చెప్పారు. -
సోమందేపల్లిలో ఉద్రిక్తత
- చోరీకి యత్నించాడంటూ అదుపులో యువకుడు - పోలీసుల దెబ్బలు తాళలేక మృతి - పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు - న్యాయం కోసం మృతదేహంతో ఆందోళన - భారీగా మోహరించిన పోలీసులు - పోలీస్ అధికారుల హామీతో సద్దుమణిగిన వివాదం సోమందేపల్లి (పెనుకొండ) : సోమందేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం తీశ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక సాయినగర్‌కు చెందిన కిష్టప్ప(28) అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం ఆందోళనకు దారితీసింది. దొంగతనం నెపంతో పోలీసులు రెండ్రోజులుగా చితకబాదడంతోనే అతను మరణించాడంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు ససేమిరా అన్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీస్ అధికారులు రంగంలోకి దిగి సర్దిచెప్పాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే... సోమందేపల్లిలోని ఎన్టీఆర్ సర్కిల్లో గల ఓ ఇంటిలోకి బుధవారం రాత్రి తమ కుమారుడు చోరీకి యత్నించాడంటూ స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కిష్టప్ప తల్లిదండ్రులు లక్ష్మమ్మ, అంజినప్ప ఆరోపించారు. రెండ్రోజులుగా పోలీసులు పలుమార్లు చితకబాదారని ఆరోపించారు. ఆ తరువాత గురువారం రాత్రి ఇంటికొచ్చిన అతను నిద్రలో ఉండగా అర్ధరాత్రి 12 గంటలకు ఛాతీలో నొప్పి వస్తోందంటూ తల్లడిల్లిపోయాడన్నారు. అంతలోనే నోట్లో నుంచి రక్తం వచ్చిందని, ఆ వెంటనే మృతి చెందినట్లు కన్నీటిపర్యంతమయ్యారు. విచక్షణారహితంగా కొట్టడంతో వీపు, ఛాతీ భాగాల్లో మూగదెబ్బలు తగిలాయని వాపోయారు. ముమ్మాటికీ పోలీసులే బాధ్యత వహించాలని తేల్చిచెప్పారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. వారికి గ్రామస్తులు కూడా మద్దతు తెలిపారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక, గాయాలు ఉన్నట్లు తేలితే మాట్లాడుదామని పోలీసులు నచ్చజెప్పి, మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాల్సిందేనంటూ మధ్యాహ్నం మరోసారి వారు మృతదేహంతో స్టేషన్ ముందు బైటాయించారు. పరిస్థితి అదుపుతప్పుతున్నట్లు గ్రహించిన పోలీసులు... పెనుకొండ, రొద్దం పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు బలగాలను రప్పించారు. వారంతా కలసి.. దహన సంస్కారాల అనంతరం మాట్లాడుకుందామని చెప్పడంతో మృతదేహాన్ని తీసుకువెళ్లారు. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, హిందూపురం వన్‌టౌన్ సీఐ ఈదుర్‌బాషా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. కిష్టప్పను పట్టిచ్చిన వ్యక్తులను పట్టుకున్న పోలీసులు ఆందోళనల నేపథ్యంలో.. దొంగతనానికి వచ్చాడంటూ కిష్టప్పను పట్టిచ్చిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకటరత్నం, వడ్డే వెంకటేష్, సీఐటీయూ, సీపీఎం, సీపీఐ నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసులను నిలదీశారు. సమాచారం ఇచ్చిన వ్యక్తులను ఏ విధంగా అదుపులోకి తీసుకుంటారంటూ ప్రశ్నించారు. వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. చోరీకి యత్నించాడన్న ఉద్దేశంతో కిష్టప్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారణ చేసుకోవచ్చని, అయితే అందుకు విరుద్ధంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోనే అతను మరణించినట్లు ఆరోపించారు. కిష్టప్ప కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ ప్రసాద్ ఏమంటున్నారంటే... చోరీకి వచ్చాడన్న ఫిర్యాదు మేరకే కిష్టప్పను తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమే. అయితే ఆ సమయంలో అతను మద్యం తాగి ఉండడంతో వదిలివేశారు. అతన్ని కొట్టలేదు. అనుమానాస్పదస్థితిలో మరణించినట్లు కేసు నమోదు చేశాం. -
దేవుడా.. ఎంతపనిచేశావయ్యా..
చిన్నారిని మింగిన సంపు సోమందేపల్లి మండలకేంద్రంలోని మారుతినగర్లో నివాసం ఉంటున్న రమేష్, లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు రాహుల్(3). సోమవారం సాయంత్రం ఇంటిలో నుంచి ఆడుకునేందుకు చిన్నారి బయటకు వచ్చాడు. అయితే సంపుపై డోర్ వేయకపోవడంతో అటువైపుగా వెళ్లిన చిన్నారి అందులో పడిపోయాడు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు 15 నిమిషాల తర్వాత కుమారుడు కనిపించలేదని బయటకు వచ్చి వెతకడం ప్రారంభించారు. ఎక్కడా కనిపించలేదు. అనుమానం వచ్చి సంపులో పరిశీలించగా నీట మునిగిన చిన్నారిని గుర్తించి స్థానికులు బయటకు తీశారు. అయితే అప్పటికే రాహుల్ ఊపిరాడక చనిపోయాడు. ‘అయ్యోదేవుడా.. ఒక్కగానొక్క కుమారుడిని బలితీసుకుంటివా.. ఎంత పని చేశావయ్యా..ఏ పాపం చేశామని మాకీ శిక్ష వేశావంటూ’ కుమారుడిని ఒడిలో పెట్టుకుని తల్లి గుండెలవిసేలా రోదించింది. ఎస్ ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
భార్య, కుమారుడి నిర్బంధం
గోరంట్ల(సోమందేపల్లి): గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన జయచంద్రారెడ్డి అనే వ్యక్తి తన భార్య శోభారాణి సహా కుమారుడిని ఇంటిలో మంగళవారం నిర్బంధించాడు. స్థానికుల కథనం ప్రకారం... తరుచూ దంపతులు గొడవపడేవారన్నారు. మంగళవారం కూడా ఇద్దరూ గొడవపడ్డారన్నారు. ఆ తరువాత భార్య, కుమారుడిని బంధించి, ఇంటికి తాళాలు వేసుకుని పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అంతలోనే బాధితురాలు శోభారాణి 100 నంబర్‌కు ఫోన్ చేసి, పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ వెంకటేశ్వరులు సిబ్బందితో వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిర్భందానికి గురైన తల్లి, కొడుకును విడిపించారు. ఆ తరువాత జయచంద్రారెడ్డిని స్ధానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. -
ఇంటర్ విద్యార్థుల ప్రేమపెళ్లి
సోమందేపల్లి (పెనుకొండ) : సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులు ఐదు రోజుల కిందట ఇంటి నుంచి పారిపోయి మైసూరులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సోమవారం స్వస్థలానికి తిరిగి వచ్చి పోలీసులను ఆశ్రయించారు. వీరిద్దరూ మైనర్లు కావడంతో తల్లిదండ్రులకు పోలీసులు కబురు పంపారు. అయితే వీరిని ఇళ్లకు తీసుకెళ్లడానికి వారు నిరాకరించారు. దీంతో పోలీసులు అబ్బాయిపై ఐపీసీ 366ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు. బాలికను అనంతపురంలోని బాలికల సంరక్షణ కేంద్రానికి పంపించారు. -
180 బస్తాల బియ్యం పట్టివేత
సోమందేపల్లి : స్టోర్ బియ్యం అక్రమంగా కర్ణాటకాకు తరలిస్తూ పట్టుబడిన సంఘటన మంగళవారం రాత్రి 10 గంటలకు మండలంలో చోటుచేసుకుంది. ధర్మవరం నుంచి ఐచర్ వాహనంలో స్టోర్ బియ్యం కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి తరలిస్తున్నట్లు విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ అనిల్ బాబుకు సమాచారం వచ్చింది. దీంతో ఆ శాఖ సీఐ గంగనాథ్ బాబు, ఎస్ఐ రామకృష్ణ సోమందేపల్లి వై జంక్షన్ వద్ద వాహనాన్ని తనిఖీ చేయగా 180 బస్తాల బియ్యం పట్టుబడ్డాయి. చెక్‌పోస్టులు, ఇతర తనిఖీ కేంద్రాల వద్ద ఎటువంటి అనుమానాలు రాకుండా బియ్యం బస్తాలపై వరిగడ్డి ఏర్పాటు చేసుకుని టార్పల్ కప్పుకుని జాతీయ రహదారిపై పోలీసుల కళ్లు గప్పి తీసుకెళుతున్నట్లు అధికారులు తెలిపారు. నిత్యం అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి ప్రాంతాల నుంచి స్టోర్ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్థానికంగా రెవెన్యూ అధికారులు లేకపోవడంతో గుడిపల్లి వీఆర్వో రవిచంద్రరెడ్డికి పట్టుబడ్డ బియ్యాన్ని అందించారు. -
కూల్ డ్రింక్‌లో 'బ్లేడ్'
సోమందేపల్లి : కూల్ డ్రింక్ బాటిల్లో (స్లైస్) బ్లేడు ప్రత్యక్షమయిన సంఘటన ఆదివారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి ప్రక్కలో ఉన్న ఓ డాబా చోటు చేసుకుంది. నాగినాయనిచెరువుకు చెందిన విజయ్నాయక్తో పాటు మరికొందరు హోటల్లో శీతల పానీయం(కూల్‌డ్రింక్స్) కొనుగోలు చేశారు. వాటిని తాగిన తర్వాత కింది భాగంలో బ్లేడ్‌ను గమనించి వారు భయాందోళనకు గురయ్యారు. దీంతో వారు హోటల్ నిర్వాహకులతో గొడవకు దిగారు. కస్టమర్లకు ఈ విధంగా వస్తువులు విక్రయిస్తున్నారా అంటూ నిలదీశారు. కూల్‌డ్రింక్ ఏజెన్సీపై కేసు నమోదు చేయిస్తామని వారు హెచ్చరించి వెళ్లారు. -
కారు - బైక్ ఢీ: ఇద్దరు యువకులు మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా సోమందేపల్లి సమీపంలో మంగళవారం కారు - బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. యువకుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కారు బోల్తా : ఎనిమిది మందికి గాయాలు
అనంతపురం : అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పేటకుంట సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అయ్యప్ప స్వామి భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ... క్షతగాత్రులను పెనుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. భక్తులు కారులో హైదరాబాద్ నుంచి శబరిమలై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులది రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.