సోమందేపల్లిలో ఉద్రిక్తత | police picket in somandepalli | Sakshi
Sakshi News home page

సోమందేపల్లిలో ఉద్రిక్తత

Published Fri, May 5 2017 11:46 PM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

సోమందేపల్లిలో ఉద్రిక్తత - Sakshi

సోమందేపల్లిలో ఉద్రిక్తత

- చోరీకి యత్నించాడంటూ అదుపులో యువకుడు
- పోలీసుల దెబ్బలు తాళలేక మృతి
- పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించిన మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు
- న్యాయం కోసం మృతదేహంతో ఆందోళన
- భారీగా మోహరించిన పోలీసులు
- పోలీస్‌ అధికారుల హామీతో సద్దుమణిగిన వివాదం


సోమందేపల్లి (పెనుకొండ) : సోమందేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట శుక్రవారం తీశ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక సాయినగర్‌కు చెందిన కిష్టప్ప(28) అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం ఆందోళనకు దారితీసింది. దొంగతనం నెపంతో పోలీసులు రెండ్రోజులుగా చితకబాదడంతోనే అతను మరణించాడంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు ససేమిరా అన్నారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. చివరకు పోలీస్‌ అధికారులు రంగంలోకి దిగి సర్దిచెప్పాల్సి వచ్చింది.

అసలేం జరిగిందంటే...
సోమందేపల్లిలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌లో గల ఓ ఇంటిలోకి బుధవారం రాత్రి తమ కుమారుడు చోరీకి యత్నించాడంటూ స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కిష్టప్ప తల్లిదండ్రులు లక్ష్మమ్మ, అంజినప్ప ఆరోపించారు. రెండ్రోజులుగా పోలీసులు పలుమార్లు చితకబాదారని ఆరోపించారు. ఆ తరువాత గురువారం రాత్రి ఇంటికొచ్చిన అతను నిద్రలో ఉండగా అర్ధరాత్రి 12 గంటలకు ఛాతీలో నొప్పి వస్తోందంటూ తల్లడిల్లిపోయాడన్నారు. అంతలోనే నోట్లో నుంచి రక్తం వచ్చిందని, ఆ వెంటనే మృతి చెందినట్లు కన్నీటిపర్యంతమయ్యారు. విచక్షణారహితంగా కొట్టడంతో వీపు, ఛాతీ భాగాల్లో మూగదెబ్బలు తగిలాయని వాపోయారు. ముమ్మాటికీ పోలీసులే బాధ్యత వహించాలని తేల్చిచెప్పారు.  

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన
మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. వారికి గ్రామస్తులు కూడా మద్దతు తెలిపారు.  పోలీసుల తీరును తప్పుబట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక, గాయాలు ఉన్నట్లు తేలితే మాట్లాడుదామని పోలీసులు నచ్చజెప్పి, మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాల్సిందేనంటూ మధ్యాహ్నం మరోసారి వారు మృతదేహంతో స్టేషన్‌ ముందు బైటాయించారు. పరిస్థితి అదుపుతప్పుతున్నట్లు గ్రహించిన పోలీసులు... పెనుకొండ, రొద్దం పోలీస్‌ స్టేషన్ల నుంచి అదనపు బలగాలను రప్పించారు. వారంతా కలసి.. దహన సంస్కారాల అనంతరం మాట్లాడుకుందామని చెప్పడంతో మృతదేహాన్ని తీసుకువెళ్లారు. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, హిందూపురం వన్‌టౌన్‌ సీఐ ఈదుర్‌బాషా పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.

కిష్టప్పను పట్టిచ్చిన వ్యక్తులను పట్టుకున్న పోలీసులు
ఆందోళనల నేపథ్యంలో.. దొంగతనానికి వచ్చాడంటూ కిష్టప్పను పట్టిచ్చిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ వెంకటరత్నం, వడ్డే వెంకటేష్, సీఐటీయూ, సీపీఎం, సీపీఐ నాయకులు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని పోలీసులను నిలదీశారు. సమాచారం ఇచ్చిన వ్యక్తులను ఏ విధంగా అదుపులోకి తీసుకుంటారంటూ ప్రశ్నించారు. వారిని విడిచిపెట్టాలని డిమాండ్‌ చేశారు. చోరీకి యత్నించాడన్న ఉద్దేశంతో కిష్టప్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారణ చేసుకోవచ్చని, అయితే అందుకు విరుద్ధంగా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతోనే అతను మరణించినట్లు ఆరోపించారు. కిష్టప్ప కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  ఎస్‌ఐ ప్రసాద్‌ ఏమంటున్నారంటే... చోరీకి వచ్చాడన్న ఫిర్యాదు మేరకే కిష్టప్పను తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమే. అయితే ఆ సమయంలో అతను మద్యం తాగి ఉండడంతో వదిలివేశారు. అతన్ని కొట్టలేదు. అనుమానాస్పదస్థితిలో మరణించినట్లు కేసు నమోదు చేశాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement