
రెండు క్షణాలు ఆలస్యమైతే...!
రెండే రెండు క్షణాలు...
ఆ రెండు క్షణాలు ఆలస్యమైతే..
ఘోరం జరిగేది. మూడు నిండు ప్రాణాలు పోయేవి. అప్రమత్తతే ఆదుకుంది. అసలేం జరిగిందంటే...
అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలంలో కలప స్మగ్లర్లు బరితెగింగించారు. చివరకు, పోలీస్ జీపుపైకి వ్యానుతో దూసుకొచ్చారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో గురువారం తెల్లవారుఝామున ఇది జరిగింది. అశ్వారావుపేట ఏఎస్‌ఐ శంకర్ తెలిపిన వివరాలు.. గురువారం తెల్లవారుఝామున సుమారు మూడు గంటలు. ఏఎస్‌ఐ శంకర్, హోంగార్డులు ఐతపు వెంకటరమణ, వెంకటేశ్వర్లు (డ్రైవర్)కలిసి బస్టాండ్ పక్కనున్న బ్రాందీ షాపు వద్ద తనిఖీ నిర్వహించారు. వారి జీపు ముందుకు వెళుతోంది. సరిగ్గా అదే సమయంలో వినాయకపురం రోడ్ నుంచి వోల్వో స్టిక్కర్‌తో ఐషర్ వ్యాన్ వాయు వేగంతో దూసుకొస్తోంది. పోలీస్ జీప్ డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమయ్యాడు. ప్రమాదం తప్పింది. పోలీస్‌స్టేషన్ ముందు నుంచే ఆ వ్యాన్ మెరుపు వేగంతో దూసుకెళ్లింది. దానిని జీపులతో పోలీసులు వెంబడిస్తున్నారు. కొద్ది దూరం వెళ్లగానే డీజిల్ అయిపోయింది. వెంటనే కిందికి దిగి, అటుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఆపి, వాటిపై వెంబడించారు. కాకతీయ గేటు వద్ద ఆ వ్యానును అడ్డగించారు.
నంబర్ లేదు.. సామాన్లు లేవు..
ఆ వ్యానులో బాడీలో కేవలం ఆరు నారవేప దుంగలు (ఒక్కోటి మీటర్ వెడల్పు, రెండు మీటర్ల పొడవు,. వీటి విలువ రూ.2.50లక్షలు) ఉన్నాయి. నంబర్ ప్లేట్ లేదు. ఈ దుంగలను రాజమండ్రికి తరలించేందుకు మండలంలోని ఆసుపాకకు చెందిన ఓ ముఠా రవాణా చేస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. పోలీసులను చూడగానే ఆ వ్యానులోని వారు కిందకు దూకి చీకట్లో పారిపోయారు. జరిగినదంతా అశ్వారావుపేట ఎస్‌ఐ సురేష్‌కు తెతిపారు. ఇంతలో అటవీ సిబ్బంది వచ్చారు. వ్యాన్ గేర్ రాడ్ ఊగిపోతూ న్యూట్రల్‌లో ఉందా... గేర్‌లో ఉందా తెలియని పరిస్థితి. బ్రేక్, ఎక్సలరేటర్, క్లచ్‌లకు కనీసం పెడల్స్ కూడా లేవు. స్టీరింగ్ ఊగుతోంది. ఎంత ప్రయత్నించినా వ్యాన్ స్టార్ట్ కాలేదు. క్రేన్ సాయంతో దానిని తెల్లవారుఝామునే పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అశ్వారావుపేట రేంజర్ మక్తార్ హుస్సేన్‌కు ఆ కలప వ్యానును పోలీసులు అప్పగించారు.
గుండె ఆగినట్టయింది...
జీపు మీదకు వ్యాన్ దూసుకురావడంతో ఒక్కసారిగా గుండె ఆగినట్టయిందని పోలీసు సిబ్బంది ‘సాక్షి’తో చెప్పారు. తమ డ్రైవర్ వెంకటేశ్వర్లు ఏమాత్రం ఏమరుపాటు ఉన్నా.. తమ ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసేవేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.