దాడి కేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు
వరంగల్ లీగల్ : ఉద్దేశపూర్వకంగా కక్ష గట్టి ఒకరిపై దాడి చేసి గాయపరిచిన నేరం రుజువు కావడంతో నగరంలోని రంగశాయిపేటకు చెందిన నేరస్తులు వేముల భూపాల్, వేముల క్రాంతికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.800 చొప్పున జరిమానా విధిస్తూ సోమవారం మూడో మున్సిఫ్ కోర్టు జడ్జి కే.అజేష్‌కుమార్ తీర్పు వెల్లడించారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. రంగశాయిపేట ప్రాంతానికి చెందిన అలువాల వెంకట్ నాయుడు పెట్రోల్‌పంపు వద్ద లారీ ఆఫీసులో గుమాస్తాగా పనిచేసేవాడు. పక్కనేగల మరో లారీ ఆఫీస్‌లో భూపాల్, క్రాంతి పనిచేసేవారు. వెంకట్ వలన తమకు వ్యాపారం లాభసాటిగా సాగడం లేదని అతడిపై వీరిద్దరు కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో 2012, మార్చి19న రాత్రి సమయంలో పని ముగించుకొని ఇంటికి వస్తున్న వెంకట్‌పై మార్గమధ్యలో దారికాచి దాడి చేశారు. కాళ్లు, చేతులపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఫోన్ ద్వారా సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి వచ్చి బాధితుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.వారి ఫిర్యాదు మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదుచేశారు.కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి అజేష్‌కుమార్ నేరస్తులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.800 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కేసును అప్పటి ఎస్సై ఆంజనేయులు పరిశోధించగా, సాక్షులను కానిస్టేబుల్ జి.నరేందర్ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏసీపీ జి.భద్రాద్రి వాదించారు.