అంబరాన్నంటిన ఉగాది సంబరం
అంబరాన్నంటిన ఉగాది సంబరం
Published Mon, Mar 27 2017 10:43 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
·- శ్రీశైలంలో మహాదుర్గగా భ్రామరి
- కైలాస వాహనంపై ఆదిదంపతులు
- అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
- కన్నడిగులతో పోటెత్తిన శ్రీగిరి
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కైలాస వాహనంపై ఆది దంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ భ్రమరాంబాదేవిని మహాదుర్గ రూపంలో అలంకరించి శాస్త్రోక్త రీతిన విశేష పక్లుఉ చేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కైలాస వాహనంపై అధిష్టింపజేసి మేళతాళాలతో వేదమంత్రోచ్చారణల మధ్య ఊరేగిస్తూ ఆలయ ప్రాంగణం నుంచి బయటకు తీసుకు వచ్చి రథశాల వద్దకు చేర్చారు. అక్కడ విశేష పూజలు నిర్వహించిన తరువాత అధికారులు, అర్చకులు, వేదపండితులు గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఉత్సవం.. అంకాలమ్మగుడి, నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయప్రాంగణం చేరింది. ఈఈ రామిరెడ్డి, ఏఈఓ కృష్ణారెడ్డి, హార్టికల్చరిస్ట్ ఏడీ, శ్రీశైలప్రభ ఎడిటర్ డాక్టర్ కడప అనిల్‌కుమార్, సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది, లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు.
శ్రీశైలం..జనసంద్రం
ఉగాది మహోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన భక్తులతో క్షేత్రం కిటకిటలాడుతోంది. సుమారు 3లక్షలకు పైగా కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రదేశాల నుంచి వచ్చిన భక్తులతో ప్రధాన పురవీధులు కిక్కిరిసిపోయాయి. ఉచిత, ప్రత్యేక, అతిశీఘ్ర దర్శనం క్యూలు వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ముందస్తుగానే వేల సంఖ్యలో భక్తులు పాదయాత్రతో శ్రీశైలం చేరుకున్నారని, అలాగే భక్తుల సంఖ్య కూడా సుమారు 20 శాతంపైగా పెరిగిందని భావిస్తున్నారు.
అందరికీ ఉచిత దర్శనం
ఊహించని విధంగా లక్షల సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకోవడంతో వృద్ధ మల్లికార్జునస్వామివార్ల వద్ద జరిగే ఆర్జిత అభిషేకాలను రద్దు చేశారు. అలాగే రూ. 200ల ప్రత్యేక దర్శనం, రూ.500 అతిశీఘ్ర దర్శన టికెట్లను కూడా నిలుపుదల చేశారు. భక్తులందరికీ మల్లన్న స్పర్శదర్శనాన్ని ఏర్పాటు చేశారు. క్యూలలో రద్దీ విపరీతంగా పెరగడంతో వేకువజామున కైలాసం క్యూ కాంప్లెక్స్‌లో కన్నడిగులు ఇష్టా రీతిగా క్యూలను ధ్వంసం చేశారు.
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
ఉగాది మహోత్సవాల్లో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రవికృష్ణ సోమవారం సాయంత్రం ఈఓ నారాయణభరత్‌గుప్తతో కలిసి పరిశీలించారు. పురవీధులు, ప్రధాన కూడళ్లు, క్యూలు, సీసీ కంట్రోల్ రూమ్ మొదలైన వాటిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎస్పీ వెంట ఓఎస్‌డి రవిప్రకాశ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్,ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌కుమార్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement