ఇల కైలాసం.. భక్తజనసంద్రం | glorious srisailesh prabhotsavam | Sakshi
Sakshi News home page

ఇల కైలాసం.. భక్తజనసంద్రం

Published Tue, Mar 28 2017 10:46 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

ఇల కైలాసం.. భక్తజనసంద్రం - Sakshi

ఇల కైలాసం.. భక్తజనసంద్రం

నందివాహనంపై ఊరేగిన ఆది దంపతులు
మహాసరస్వతీగా భ్రమరాంబాదేవి
·కర్ణాటకను తలపించిన శ్రీశైలక్షేత్రం
పోటెత్తిన పాతాళగంగతీరం
   
శ్రీశైలం: శివభక్తులకు భూకైలాసమైన శ్రీశైల మహాక్షేత్రం భక్తజనసంద్రంగా మారింది. స్వస్తిశ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది ఉత్సవాల్లో భాగంగా  రాత్రి 7.30 గంటలకు శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లు నందివాహనంపై అధిష్టించగా అమ్మవారు మహాసరస్వతీ రూపంలో భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. నంది వాహనంపై భ్రామరితో కొలువుతీరిన ఆదిదంపతులను, అమ్మవారి అలంకార రూపాన్ని  వేదమంత్రోచ్ఛారణలతో మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం నుండి రథశాల వద్దకు తీసుకు వచ్చారు. అక్కడి నుంచి గ్రామోత్సవం నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు కొనసాగి రాత్రి9.30 గంటలకు  ఆలయ ప్రాంగణం చేరింది. కనులపండువగా జరిగిన ఈ గ్రామోత్సవంలో లక్షలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అమ్మవారి దివ్యమంగళరూపాన్ని కనులరా దర్శించుకొని కర్పూర నీరాజనాలర్పించారు. కార్యక్రమంలో దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ, ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, హార్టికల్చరిస్ట్‌ ఏడీ వెంకటరాఘవరావు, ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, అర్చకులు, వేదపండితులు, వేలాది మంది భక్తజనం పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం అశేషజనవాహిని మధ్య స్వామిఅమ్మవార్ల ప్రభోత్సవం సాగింది.  శ్రీశైలం వచ్చిన లక్షలాది మంది కన్నడీగులతో శ్రీశైల మహాక్షేత్రం కర్ణాటకను తలపిస్తోంది. అమావాస్య కన్నడీగులకు శుభకరమైన రోజు కావడంతో పవిత్ర పాతాళగంగలో స్నానాలాచరించుకుని కృష్ణమ్మకు గాజులు, పసుపు, కుంకుమలతో సారెను సమర్పించారు. దాదాపు 3 లక్షల మంది భక్తులు పాతాళగంగలో పవిత్రస్నానాలు చేసి ఉంటారని అధికారుల అంచనా.  
    
పురవీధుల్లో ఎస్పీ ఫ్లాగ్‌ మార్చ్‌:
రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రవికృష్ణ, ఓఎస్‌డీ రవిప్రకాశ్, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ వెంకటేష్, ఆత్మకూరు డీఎస్సీ వినోద్‌కుమార్‌లతో కలిసి బందోబస్తు సిబ్బందితో పురవీధుల్లో ఫ్లాగ్‌మార్చ్‌ చేశారు. శ్రీశైలం పీఎస్‌ నుంచి హరిహరరాయగోపురం, లడ్డూ కౌంటర్లు అక్కడి నుంచి గంగాధర మండపం, నందిమండపం, గంగా,గౌరి సదన్, మల్లికార్జునసదన్‌ల మీదుగా ఫ్లాగ్‌మార్చ్‌ కొనసాగింది.  
   
కార్యక్రమాల నిర్వహణలో గందరగోళం:
ఉగాది మహోత్సవాల్లో భాగంగా మంగళవారం 5.30 గంటలకు ప్రభోత్సవం నిర్వహించాల్సి ఉండగా, దానిని 5 గంటలకే ప్రారంభించి 20 నిమిషాలలో అధికారులు ముగించేశారు. అలాగే రాత్రి 10 గంటలకు ప్రారంభం కావాల్సిన వీరాచార విన్యాసాలు 7గంటల నుంచి ప్రారంభమయ్యేలా మార్పులు చేయడంతో కార్యక్రమాల నిర్వహణలో గందరగోళం ఏర్పడింది. అమావాస్య ముగిసినందున కార్యక్రమాలన్నింటిని త్వరగా ముగించడం ద్వారా కన్నడీగులు తిరుగు ప్రయాణానికి సన్నద్దులవుతారనే ఉద్దేశం అందరిలోనూ కలిగింది. 
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement