
టీడీపీ హయాంలో విగ్రహాల ధ్వంసం: రాధా
విజయవాడలో రంగా విగ్రహం ధ్వంసం
విజయవాడ(అజిత్‌సింగ్‌నగర్): విజయవాడ నగరమంతా సంక్రాంతి వేడుకల్లో నిమగ్నమవడాన్ని అదునుగా చేసుకొన్న కొంతమంది దుండగులు బరితెగించారు. విజయవాడ సింగ్‌నగర్ పైపులరోడ్డులో ఉన్న వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. ఆదివారం తెల్లవారుజామున విగ్రహం ధ్వంసాన్ని గుర్తించిన వంగవీటి రంగా అభిమానులు పెద్దసంఖ్యలో పైపులరోడ్డుకు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విగ్రహం కూల్చిన దిమ్మెపై రంగా చిత్రపటాన్ని ఉంచి క్షీరాభిషేకం చేశారు.
ఘటన స్థలానికి చేరుకున్న రంగా తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న నగరంలో మళ్లీ అల్లర్లు సృష్టించి, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని 24 గంటల్లోగా అరెస్టు చేయాలని, లేనిపక్షంలో ఇటువంటి చర్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.