వాసవీమాత విగ్రహం ధ్వంసం
– అర్ధరాత్రి జేసీబీతో భజనమందిరం కూల్చివేత
– ఆర్యవైశ్య, హిందూవులు నిరసన
– పోలీసుస్టేషన్‌ను ముట్టడి
హిందూపురం అర్బన్: పట్టణంలోని బాలాజీనగర్ కాల్వగడ్డ పక్కనే ఉన్న వాసవీభజన మందిరాన్ని శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీతో కూల్చివేశారు. ఆలయంలో ధ్వంసం చేసిన అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లారు. శనివారం ఉదయాన్నే విషయం పట్టణంలో దావానంలా వ్యాపించింది. పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు, హిందూ సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టులో కేసున్నా కూల్చేశారు.. : కాల్వపోరంబోకు స్థలంలో నిర్మించిన భజన మందిరం కొద్దిగా పక్కనే ఉన్న స్థలం వరకు నిర్మితమైంది. పక్కస్థల యాజమాని చంద్రశేఖర్ స్థలాన్ని దానంగా ఇవ్వడంతో ఆలయం నిర్మించినట్లు మందిరం నిర్వాహకులు చెబుతున్నారు. అయితే పక్క స్థల యాజమాని చంద్రశేఖర్, మరోవ్యక్తి వెల్డింగ్‌బాషా మధ్య స్థల వివాదం ఏర్పడింది. దీనిపై కోర్టులో దావా నడుస్తోంది. ఇదిలా ఉండగా శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయాన్ని కూల్చివేశారు.
వాసవీమాత విగ్రహ కూల్చివేతను నిరసిస్తూ ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు జేపీకేరాము,బీజేపీ నాయకులు ఆదర్ష్‌కుమార్, వరప్రసాద్, రమేష్‌రెడ్డి, యువనాయకులు ప్రకాష్, రఘు, హిందూసురక్షాసమితి సభ్యులు రవి, చారుకీర్తి, బాబుతో ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్‌సర్కిల్‌కు చేరుకుని మానవహారం ఏర్పడి రాస్తారోకో చేశారు. స్థలవివాదముంటే కోర్టు ద్వారా తేల్చుకోవాలే తప్ప ఇలా అర్ధరాత్రి దొంగల్లా కూల్చడం ఏంటని మండిపడ్డారు. విగ్రహాన్ని ధ్వంసంచేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో సీఐ మధుభూషణ్, ట్రాఫిక్ పోలీసులు వారికి సర్ధిచెప్పడంతో వారు అక్కడి నుంచి నేరుగా వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌ను తరలివచ్చి ముట్టడించారు. డీఎస్పీ కరీముల్లా షరీఫ్‌తో మాట్లాడి నిందితులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం భజనమందిరాన్ని శుభ్రం చేసి కూల్చిన చోట వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి పూజలు చేశారు.