పూర్తి కాని సెర్చ్ | VC candidate incomplete committee meeting | Sakshi
Sakshi News home page

పూర్తి కాని సెర్చ్

Published Sat, Mar 26 2016 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

పూర్తి కాని సెర్చ్

పూర్తి కాని సెర్చ్

అసంపూర్తిగా కమిటీ సమావేశం
6న మరోసారి సమావేశం
వీసీ అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ

 ఏయూ క్యాంపస్: సెర్చ్ పూర్తి కాలేదు.. అలా అనే కంటే.. ప్రభుత్వం తరఫున సీఎం ఒక పేరు ఇంకా సూచించనందునే కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. దాంతో ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పదవికి అభ్యర్థి ఎంపికకు ఏప్రిల్ ఆరో తేదీన మరోసారి సమావేశం కావాలని సెర్చ్ కమిటీ నిర్ణయించింది. ఉపకులపతి ఎంపిక కోసం  ఏర్పాటు చేసిన ఈ కమిటీ తొలిసారి శుక్రవారం ఉదయం సమావేశమైంది. హైదరాబాదులో జరిగిన ఈ సమావేశానికి సభ్యులు అనందకృష్ణన్, రాజ్‌పాల్ సింగ్, సుమిత్రా దావ్రాలు హాజరయ్యారు. తమకు అందిన దరఖాస్తులను మధ్యాహ్నం 2 గంటల వరకు పరిశీలించినట్లు తెలిసింది. అయితే దరఖాస్తులు ఎక్కువగా రావడం, పరిశీలన పూర్తికాకపోవడంతో వచ్చేనెల ఆరో తేదీన మరోసారి భేటీ కావాలని సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం.

ఆ సమావేశంలో తుది జాబితా సిద్ధం చేసే అవకాశం ఉంది. కమిటీ తమకు అందిన దరఖాస్తులను పరిశీలించి వడపోసి ముగ్గురు పేర్లతో జాబితాను ముఖ్యమంత్రికి, అక్కడ నుంచి గవర్నర్‌కు పంపాల్సి ఉంది. అయితే వీసీ పదవికి వందకు పైగా దరఖాస్తులు అందాయి. వీటన్నింటినీ పరిశీలించడం పెద్దపనిగా మారింది. ఈ పని పూర్తి కాకపోవడంతో తుది జాబితా తయారీకి మరో సమావేశం నిర్వహించడం తప్పనిసరి అయ్యింది. కాగా వీసీ ప్యానల్ జాబితాకు ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వం తరపున ఒక పేరును సూచించాల్సిన అవసరం ఉంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆ పదవిని ఎవరికి కేటాయించాలనే విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతున్నారని సమాచారం.

సమావేశం అసంపూర్తిగా ముగియడానికి ఇదీ ఓ కారణమని తెలిసింది. సీఎం కార్యాలయం నుంచి ఖచ్చితమైన సమాచారం అందితే రానున్న సమావేశంలో ముగ్గురి పేర్లతో జాబితా సిద్ధం అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గతంలో వీసీ ఎంపిక విషయంలోనూ సెర్చ్ కమిటీ పలుమార్లు సమావేశం కావడాన్ని వర్సిటీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రెండు పర్యాయాలు కమిటి సభ్యులు భేటీ అయిన తరువాతనే పేర్లు కొలిక్కి వచ్చిందంటున్నారు. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగుతోందని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement