అపద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.
అనంతపురం : అపద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. బెంగళూరు వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఎమ్మెల్సీ ఓట్ ఫైండర్’ అనే సరికొత్త మొబైల్ యాప్‌ను స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రారంభించారు.
గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆతర్వాత పట్టించుకోలేదన్నారు. ప్రజాపాలన కాకుండా ఆయన సొంత అజెండాతో పరిపాలన సాగిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను నిలువునా మోసగించారన్నారు. ఉద్యమం చేస్తే యువత, విద్యార్థులపై కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. మహిళా సాధికారత కార్యక్రమం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు తప్ప మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
కేవలం మూడు కుటుంబాల కోసమే ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేశారన్నారు. రాష్ట్రంలో సాధారణ మహిళలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులుగా ఉన్న మహిళలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. మార్చి 9న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరుఫున పోటీ చేస్తున్న తనను దీవించాలని ఓటర్లను అభ్యర్థించారు. టీడీపీ మద్ధతుతో బరిలో నిలిచిన అభ్యర్థి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, బెంగళూరు ఐటీ విభాగం సభ్యులు ముకుందాపురం ప్రతాప్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, ఉదయ్‌కిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.