తూచ్...నాన్ వెజ్ అమ్ముకోవచ్చు
►మాంసం విక్రేతలకు ‘పచ్చ’జెండా
►తమ్ముళ్ల డీల్ సెట్
విజయవాడ సెంట్రల్ :
నగరంలో మాంసం విక్రయాల నిషేధానికి అధికారులు చెల్లుచీటి ఇచ్చేశారు. పవిత్ర కృష్ణా పుష్కరాలు అయినప్పటికీ మాసం అమ్ముకోవచ్చు. కబేళా కూడా పనిచేస్తోందంటూ కమిషనర్ జి.వీరపాండియన్ బుధవారం ప్రకటించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా నగరంలో చేపలు మాంసపు ఉత్పత్తుల విక్రయాలను 9 నుంచి 25వ తేదీ వరకు నిషేధిస్తున్నామని ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే వ్యాపారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని మొన్న హెచ్చరించారు. రెండు రోజులు గడిచే సరికి తూచ్...అన్నారు. దీని వెనుక పెద్ద కథే నడిచిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలు కథ ఇదీ
మాంసం విక్రయాల నిషేధం నగరంలోని స్టార్ హోటల్ నిర్వాహకులకు మింగుడుపడలేదు. కృష్ణాపుష్కరాలకు మద్యం, మాంసం భారీఎత్తున విక్రయాలు జరుగుతాయని, ఇలాంటి సమయంలో నిషేధం విధిస్తే తమ ఆదాయం ఏం కానూ? అని టీడీపీ ప్రజాప్రతి నిధుల వద్ద పంచాయితీ పెట్టారు. ఎంపీ కార్యాలయంలో సర్వం తానై వ్యవహరించే ఓ చోట నేత రంగంలోకి దిగాడు. స్టార్ హోటళ్ల నిర్వాహకులతోపాటు చిన్న చితకా హోటళ్ల యజమానులు, మాంసం దుకాణ విక్రయదారులతో రాయ‘బేరాలు’ సాగించాడు. మంగళవారం రాత్రి డీల్ కుదిరింది. తెల్లవారే సరికి ఓ మంత్రి కమిషనర్‌తో మాట్లాడేశారు. మాంసం లేకపోతే హోటళ్ల యజమానులు ఇబ్బంది పడతామంటున్నారు, వదిలేయమంటూ మంత్రి కమిషనర్ కు ఆదేశాలిచ్చారు. మాంసం విక్రయాలపై నిషేధం శుభ్రంగా అటకెక్కింది. కబేళా యథావిధిగా పనిచేస్తోందని, వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనలు పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ చెబుతున్నారు. పారిశుధ్యానికి విఘాతం కల్గిస్తే వ్యాపారులపై చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరికల కొసమెరుపు విసిరారు.
మంత్రి పేషీ హడావుడి
సిటీలో చికెన్, మటన్, చేపలు ఇతరత్రా మాంసం రోజుకు సగటున 20 టన్నులు విక్రయం జరుగుతోందని అంచనా. సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వ్యాపారం సాగుతోంది. వేడుకలు, ఫంక్షన్ల సీజన్‌లో 50 శాతం అదనంగా వ్యాపారం ఉంటోంది. ఈక్రమంలో నాన్ వెజ్ విక్రయాలను నిషేధిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించగానే ఓ మంత్రి పీఏ నగరపాలక సంస్థ అధికారులకు ఫోన్ చేసి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో సార్ అడగమన్నారంటూ వివరాలు సేకరిం చారు. రెండు రోజుల్లో రంగంలోకి దిగిన తెలుగు తమ్ముళ్లు డీల్ సెట్ చేసేశారు.