వజ్రాలున్నాయని వినాయక విగ్రహం పేల్చివేత
మడికొండ: వజ్రాలున్నాయనే అనుమానంతో ఓ పురాతన రాతి వినాయక విగ్రహాన్ని కొందరు దుండగులు పేల్చివేశారు. అందులో ఏమి లభించకపోవడంతో విగ్రహ శకలాలను చెరువులో వేసేందుకు వెళ్తూ పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన మడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండపర్తిలో జరిగింది.
మడికొండ సీఐ డేవిడ్‌రాజ్ కథనం ప్రకారం.. హన్మకొండ మండలం కొండపర్తి గ్రామంలోని త్రికుటాలయంలో వినాయకుడి రాతి విగ్రహం ఉంది. ఈ విగ్రహంలో వజ్రాలున్నాయని ప్రచారం ఉండడంతో 2015 నవంబర్ 22న ఇల్లందుల వీరస్వామి, కట్కూరి మధుకర్(కొండపర్తి), గొలనుకొండ నవీన్, కొమురవెల్లి అనిల్ కుమార్(జేపీఎన్ రోడ్డు, వరంగల్), ఇల్లందుల అజయ్, ముప్పారపు మనోజ్(శివనగర్), నెల కంటి యాకూబ్(పడమర కోట), నల్లం దుర్గ(గిర్మాజీపే ట), మంద కిషోర్(కరీమాబాద్), తాటికాయల ఏలియా(మల్లక్‌పల్లి), సతీష్, మంద సతీష్(పసరకొండ) దొంగి లించారు. విగ్రహాన్ని పేలుడు పదార్థంతో పేల్చగా ముక్కలైపోయింది. అందులో ఏమి దొరకకపోవడంతో శకలాలను ఉర్సు దగ్గర చెరువులో వేయడానికి బయల్దేరారు.
పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వారు నింది తులను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరం అంగీకరించారు. వారు ఉపయోగించిన జేసీబీ ప్రొక్లైనర్, 2 బైక్‌లు, 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ డేవిడ్‌రాజ్ తెలిపారు.