
వినాయకచవితి చందా వివాదం
► పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ
► వాహనాన్ని ధ్వంసం చేసిన గ్రామస్తులు
► ప్రాణభయంతో పరుగులు తీసిన పోలీసులు
బుచ్చినాయుడుకండ్రిగ : వినాయక చవితి చందా విషయమై పోలీసులు, గ్రామస్తుల మధ్య నెలకొన్న వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ సంఘటన మండలంలోని పద్మావతిపురం వద్ద ఆదివారం జరిగింది. కొంతమంది యువకులు కేటీరోడ్డుపై వెళుతున్న వాహనాలను వినాయక చవితి చందా వసూలు చేస్తున్నారు. ఆదివారం తిరుపతికి చెందిన ఎర్రచందనం టాస్క్‌ఫోర్సు ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి సిబ్బందితో కలిసి చెన్నై నుంచి ఎర్రచందనం స్మగ్లరును తీసుకుని వ్యాన్‌లో తిరుపతికి వెళుతున్నారు. ఆ వ్యాన ును యువకులు అడ్డుకున్నారు.
పోలీసు సిబ్బంది రూ.10 ఇచ్చారు. దీంతో యువకులు పోలీసు సిబ్బందిని దుర్భాషలాడారు. ఈ క్రమంలో ఒక యువకుడిపై కానిస్టేబుల్ చెయ్యి చేసుకున్నాడు. దీంతో యువకులకు, టాస్క్ ఫోర్సు సిబ్బంది మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది తెలుసుకున్న పద్మావతిపురం గ్రామస్తులు, యువకులతో కలిసి టాస్క్‌ఫోర్సు సిబ్బందిపై దాడికి దిగారు. పోలీసులమని చెప్పినా వినకుండా వాహనాన్ని ధ్వంసం చేశారు. భయందోళనకు గురైన టాస్క్‌ఫోర్సు సిబ్బంది వ్యాన్ వదిలేసి బస్సు ఎక్కి బుచ్చినాయుడుకండ్రిగలోని పోలీసుస్టేషన్‌కు వచ్చి ఎస్‌ఐ రామ్‌మోహన్‌కు వివరించారు. ఆయన సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వ్యాన్‌ను తీసుకుని పోలీసుస్టేషన్‌కు వచ్చారు. జరిగిన గొడవను జిల్లా అధికారుల దృష్టికి తెలియజేశామని, వారి అదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రామ్‌మోహన్ తెలిపారు.