జులైవాడ, న్యూస్‌లైన్ : అభివృద్ధి పేరుతో ఆదివాసీల వనరులను విధ్వంసం చేస్తున్నారని ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి మైపతి అరుణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ట్స్ కళాశాలలో మానవహక్కుల వేదిక జిల్లా ఐదో మహాసభలు ఆదివారం ముగిశాయి. సభలకు మానవహక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు కందాల శోభారాణి అధ్యక్షత వహించారు. సభాప్రాంగణానికి మానవహక్కుల వేదిక నాయకులు కె.బాలగోపాల్, బుర్రా రాములు నామకరణం చేశారు.
ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు 10 ఆదివాసీ జిల్లాలు ఉన్నాయన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో పోడు పేరుతో గిరిజనేతరులు అటవీ భూములను సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో హైడల్ విద్యుత్ ప్రాజెక్టుతో కుంటాల జలపాతం, పురాతన సోమేశ్వర స్వామి దేవాలయం నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉందన్నారు.
ఐటీడీఏ పరిధిలోని ఉట్నూరులోనే 21 వేల మంది గిరిజనేతరులు పోడు చేసుకుంటున్నారని వివరించారు. ఓపెన్‌కాస్ట్‌తో 244 ఆదివాసీ గూడేలు లేకుండా పోతున్నాయన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఆది వాసీలు మాత్రమే ఉన్నప్పుడు పులులు, జం తు జాతులు ఉన్నాయని చెప్పారు. గిరిజనేతరులు వచ్చాక పులుల జాడ కనిపించడం లేదని ఆయన తెలిపారు. ఆదివాసీలు ప్రకృతి ఆరాధకులైతే గిరిజనేతరులు వ్యాపారదృక్ప థం కలిగిన వారని వివరించారు. గిరిజనేతరులతో అటవీ విధ్వంసం జరుగుతోందన్నారు.
కామన్‌స్కూల్ విధానం రావాలి..
భారత విద్యావిధానంలో కామన్ స్కూల్ విధానం రావాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎర్రంరెడ్డి నర్సింహరెడ్డి అన్నారు. విద్యారంగం ప్రైవేటికీకరణపై మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఒక్కోవిద్యార్థికి ప్రభుత్వం విద్యాపరంగా పెట్టే ఖర్చు ఒక్కో రకంగా ఉంటుందన్నారు. నవోదయ విద్యాలయాల్లో ఒక్కోవిద్యార్థిపై 16 వేలు, ఏపీఆర్ స్కూళ్లలో సంవత్సరానికి 14వేలు, సెంట్రల్ స్కూల్‌లో 18వేలు, ప్రభుత్వ స్కూళ్లలో రూ. 1400 ఖర్చు పెడుతున్నాయని వెల్లడించారు. చదువు మూడో కన్నులాంటిదని, విద్య ద్వారానే మనకు జరిగే అన్యాయాన్ని తెలుసుకోవచ్చన్నారు. ప్రతి 1000 మందిలో 60 మంది బాలురు, 24 మంది బాలికలు పోషకాహార లోపంతో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీవన్‌కుమార్ ఆహారభద్రతపై మాట్లాడుతూ ఒక మనిషికి సగటున 8,9 కిలోల బియ్యం నెలకు అవసరమని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఆహార భద్రత ద్వారా ఒక వ్యక్తికి ఐదు కిలోలు ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. ధరలను నియంత్రించే స్థితిలో ప్రభుత్వాలు లేవన్నారు. అనంతరం మానవహక్కుల వేదిక ప్రణాళిక, కార్యవర్గ ఎంపికపై చర్చించారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక జిల్లా కార్యదర్శి బాదావత్ రాజు, నాయకులు సాదు రాజేష్‌కుమార్, దడబోయిన రంజిత్‌కుమార్, పాలకుర్తి సత్యం, ప్రొఫెసర్ కాత్యాయనీవిద్మహే తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పేరుతో వనరుల విధ్వంసం
Published Mon, Aug 12 2013 2:58 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement