కొణతాలను చేర్చుకుంటే రాజీనామా చేస్తాం
►కశింకోట మండల టీడీపీ నాయకుల హెచ్చరిక
► టీడీపీ నేతలపై కేసులు పెట్టిన ఆయన్ని పార్టీలో ఎలా చేర్చుకుంటారు
► తమ నిర్ణయాన్ని కాదంటే మూకుమ్మడిగా గుడ్‌బై
కశింకోట: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను పార్టీలో చేర్చుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలపై మండల టీడీపీ భగ్గుమంది. ఈ మేరకు కశింకోటలో ఆదివారం రాత్రి మండల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. రామకృష్ణను టీడీపీలో చే ర్చుకోవడానికి ససేమిరా వీలులేదని, శ్రేణుల మనోగతాలకు విరుద్ధంగా చేర్చుకుంటే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తామని పలువురు టీడీపీ నాయకులు హెచ్చరించారు. విశాఖ డెయిరీ డెరైక్టర్ మలసాల రమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొణతాల రామకృష్ణ గతంలో మండల టీడీపీ నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని, జైలు పాలు చేశారని ఆరోపించారు.
మంత్రిగా ఉన్నప్పుడు సంప్రదాయాలను పాటించకుండా టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీపీలను వేధింపులు, ఇబ్బందులకు గురిచేసి విలువ లేకుండా చేశారని ధ్వజమెత్తారు. పీఎసీఎస్ ఎన్నికల్లోను టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులపాలు చేశారన్నారు. అటువంటి కొణతాలను చేర్చుకుంటే సహించేది లేదని, రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాయల మురళీధర్ మాట్లాడుతూ కార్యకర్తల అభీష్టానికి విరుద్ధంగా కొణతాలను చేర్చుకోవడం వల్ల పార్టీకి ఇక్కడ తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వేగి వెంకటరావు మాట్లాడుతూ పసుపు చొక్కా వేసుకున్న తనను ఎన్నికల కేంద్రంలో ఏజెంటుగా వెళ్లకుండా పోలీసులతో మంత్రిగా ఉన్న కొణతాల బయటకు నెట్టించి వేశారని, అక్రమంగా కేసు బనాయించి యలమంచిలి సబ్ జైలులో తొమ్మిది రోజులు ఉండేలా చేశారని ఆరోపించారు. అటువంటి కొణతాలను చేర్చుకుంటే కార్యకర్తలు ఎలా ఒప్పుకుంటారని ప్రశ్నించారు. ఎంపీటీసీ సభ్యుడు వేగి దొరబాబు మాట్లాడుతూ పచ్చ చొక్కా అంటే పడని కొణతాల ఇప్పుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎలా టీడీపీలోకి చేరుతారని ప్రశ్నిం చారు.
కార్యకర్తలకు వ్యతిరేకంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ముకుమ్మడిగా రాజీనామా చేయాలని సమావేశం నిర్ణయించింది. అంతే కాకుండా కశింకోటలో సోమవారం మండలస్థాయి సమావేశాన్ని పార్టీ శ్రేణులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో నిర్వహించి కొణతాలను చేర్చుకోవద్దని గ్రామాల వారీగా తీర్మానాలు తీసుకొని అధిష్టానానికి పంపాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పొన్నగంటి నూకరాజు, పార్టీ నాయకులు తిరుచోళ్ల రామకృష్ణ, వేగి గోపీకృష్ణ, మలసాల కుమార్‌రాజా, అందె సన్యాసిరావు, గొంతిన అప్పలనాయుడు, కరక రాజు, కలగా సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.