విషాద వీచిక
విషాద వీచిక
Published Fri, May 26 2017 12:16 AM | Last Updated on Thu, Apr 4 2019 4:46 PM
ఏలూరు అర్బన్ : ధర్మం.. సంపాదన.. సంసారం వంటి అన్ని విషయాల్లో తోడు, నీడగా ఉంటామంటూ ‘ధర్మేచ.. అర్థేచ.. కామేచ.. నాతిచరామి’ అని పెళ్లినాడు ప్రమాణం చేసిన ఆ ఇద్దరినీ ఏడాదిన్నర వ్యవధిలో మృత్యువు కాటేసింది. భర్తను పోగొట్టుకున్న తల్లి తన తండ్రి ఇంట ఆశ్రయం పొందుతుండగా.. ఆ వెనుకే కుమార్తె సైతం భర్త వియోగంతో తన ఇద్దరు బిడ్డల్ని తీసుకుని తల్లి చెంతకు చేరింది. నిండు నూరేళ్లు తమతో ఉంటారనుకున్న వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లీకూతుళ్లు ఒంటరులయ్యామనే ఆవేదనతో కుమిలి పోయారు. జీవితంపై విరక్తి పెంచుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డల భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళనతో సతమతమయ్యారు. చివరకు.. చిన్నారులిద్దరికీ విషమిచ్చి, తామూ అదే విషం తాగి ఈ లోకాన్ని వీడిపోయారు. వారం రోజుల తరువాత గాని ఈ విషాదాంతం బాహ్యప్రపంచానికి తెలియలేదు.
వారిదో అందమైన కుటుంబం. రేపటిపై బెంగలేని ఆనందమయ జీవితం. ఇంటి యజమాని పేరు అడ్డగూడూరు వెంకట సూర్యనారాయణమూర్తి. ఏలూరులో రైల్వే ఎస్సైగా పనిచేశారు. మూడేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. ఆయన భార్య నాగపద్మావతి (52). ఆ దంపతుల ఏకైక గారాలపట్టి సంతోషిరూప (37). ఆమెను పదేళ్ల క్రితం ఒడిశా రాష్ట్రం రాయగఢలోని ఓ పేపర్ మిల్లులో ఏజీఎంగా పనిచేస్తున్న దేవరకొండ శ్రీధర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ దంపతులకు సాయిసిద్ధార్థ్, సాయిరామ్ అనే కుమారులు కలిగారు. సిద్ధార్థ్ వయసు తొమ్మిదేళ్లు కాగా, సాయిరామ్ వయసు ఐదేళ్లు. వారందరి జీవితాలు చీకూచింత లేకుండా సంతోషంగా సాగిపోతున్నాయి. వారిమధ్య పెనవేసుకున్న అనుబంధాన్ని, అన్యోన్యతను చూసి విధికి కన్నుకుట్టింది. ఇంటిపెద్ద అడ్డగూడూరు సూర్యనారాయణమూర్తిని రెండేళ్ల క్రితం మృత్యువు తీసుకెళ్లిపోయింది. అతని మరణాన్ని భార్య నాగపద్మావతి తట్టుకోలేకపోయింది. దుఃఖాన్ని దిగమింగుకుని.. ఏలూరు బీడీ కాలనీలోని ద్వారకా నగర్‌లో నివాసం ఉంటున్న తన తండ్రి, విశ్రాంత ఇంజినీర్ కౌతవరపు వెంకటరమణ పంచన చేరింది. భర్త పోయిన బాధనుంచి క్రమంగా కోలుకుంటున్న సమయంలో ఆమె మరో పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. తన కుమార్తె సంతోషిరూప భర్త శ్రీధర్ గత ఏడాది నవంబర్‌లో శ్రీకాకుళం జిల్లా పాలకొండ వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించాడని.. కూతురు సంతోషిరూప తీవ్రంగా గాయపడిందని తెలిసి తల్లడిల్లిపోయింది. తండ్రితో కలిసి హుటాహుటిన అక్కడకు వెళ్లి.. షాక్‌కు గురైన కుమార్తెను మామూలు మనిషిని చేసేందుకు శతవిధాలా యత్నించింది. చాలారోజులపాటు అల్లుడు మరణించాడన్న విషయాన్ని కుమార్తెకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడింది. చివరకు సంతోషరూపను, మనుమళ్లు సాయిసిద్ధార్థ్, సాయిరామ్‌లను తాను ఆశ్రయం పొందుతున్న తండ్రి ఇంటికి తీసుకొచ్చింది.
బెంగ కుంగదీసింది
కుమార్తెను, మనుమళ్లను తండ్రి ఇంటికి తీసుకొచి్చన తరువాత అల్లుడు శ్రీధర్ మరణించాడనే విషయం కూతురికి చెప్పింది. కాంతులీనిన జీవితాల్లో ఒక్కసారిగా చీకట్లు అలముకున్నాయని తల్లీకూతుళ్లు బెంగప డ్డారు. నాగపద్మావతి తండ్రి కౌతవరపు వెంకటరమణ ఏడు పదుల వయసుతో వార్ధక్యంలో ఉన్నారు. మనుమలు ముక్కుపచ్చలారని చిన్నారులు కావడంతో వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్లగలమో లేదోనని తల్లీకూతుళ్లు కుమిలిపోయారు. ఆ పెద్దాయనపై ఎంతకాలం ఆధారపడగలమని ఆందోళన చెందారు. మూడు నెలలుగా వారిద్దరూ ఇదే ఆవేదనతో కుంగిపోతున్నారు. పరిస్థితిని గమనించిన వెంకటరమణ వారిని మరో ప్రాంతానికి తీసుకెళితే కుదుటపడతారనే అభిప్రాయానికి వచ్చారు. ఒడిశాలోని జంషెడ్‌పూర్‌కు నివాసం మారిస్తే వారి మనోవేదన తగ్గుతుందనే ఉద్దేశంతో ఈనెల 15వ తేదీన జంషెడ్‌పూర్ వెళ్లి అద్దె ఇంటిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు. అక్కడి నుంచి రోజూ కుమార్తె, మనుమరాలు, మునిమనుమళ్లతో ఫోన్‌లో మాట్లాడుతూ వచ్చారు. ఈనెల 18న వారికి వెంకటరమణ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. బాధలో ఉండి ఫోన్ తీయడం లేదని భావించిన ఆయన.. ఎట్టకేలకు అక్కడో ఇంటిని అద్దెకు ఖాయం చేసుకున్నారు. గురువారం జంషెడ్‌పూర్‌నుంచి ఏలూరులోని ఇంటికి చేరుకున్నారు. కాలింగ్ బెల్ నొక్కినా.. తలుపు కొట్టినా ఇంట్లోంచి ఎవరూ బయటకు రాలేదు. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపుల్ని పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. కుమార్తె, మనుమరాలు, మునిమనుమళ్లు విగతజీవులై పడి ఉన్నారు. ఆ నలుగురూ మరణించారని తెలిసి ఆయన గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈనెల 18న ఆ తల్లీకూతుళ్లు ఇద్దరు చిన్నారులకు నీటిలో విషం (గుళికలు) కలిపి తాగించి.. ఆ తరువాత వారూ తాగినట్టు పోలీసులు అక్కడి పరిస్థితులను బట్టి నిర్ధారణకు వచ్చారు.
దుర్గంధం వెదజల్లుతున్నా గుర్తించలేకపోయారు
వెంకటరమణ ఇంటినుంచి కొన్ని రోజులుగా విపరీతమైన దుర్వాసన వెదజల్లుతున్నా చుట్టుపక్కల వారు ఆ నలుగురు మరణించినట్టు గుర్తించలేకపోయారు. ఆ ఇంటికి సమీపంలో పొదలు ఉండటం, చెత్తాచెదారం పేరుకుపోవడంతో.. వాటిమధ్య పంది మరణించి ఉంటుందని భావించారు. దానివల్లే భరించలేని దుర్వాసన వచ్చిందనుకున్నారు. వెంకటరమణ ఇంటికి తిరిగి వచ్చాక గాని ఈ విషాదాంతం వెలుగు చూడలేదు. ఇంటి పెద్దలు మరణించడంతో తాము అనాథలమయ్యామని భావించి తన కుమార్తె, మనుమరాలు చిన్నారులకు విషమిచ్చి వారూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వెంకటరమణ చెప్పారు. ఏఎస్పీ రత్న, డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, సీఐ అడపా నాగమురళి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలు బాగా కుళ్లిపోయి ఉండటంతో ఒక్కొక్క దానిని విడివిడిగా మూటలు గట్టి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement