
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి: జేఈవో
తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ప్రత్యేక అలంకరణ ఏర్పాట్లు పూర్తయ్యయని తిరుమల జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు. ఏకాదశి రోజున స్వర్ణరథం, ద్వాదశికి శ్రీవారి చక్రస్నానం కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య భక్తులే అధిక ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 48 గంటలపాటు వైకుంఠద్వారం తెరిచే ఉంటుందన్నారు. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు, సిఫారసు లేఖలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సామాన్య భక్తులను ఆదివారం(రేపు) ఉదయం 11 గంటలకు కంపార్ట్‌మెంట్లలోకి అనుమతిస్తామన్నారు.
ఏకాదశి రోజున ఒంటిగంటలకు వీఐపీ దర్శనాలు ప్రారంభమవుతాయని జేఈఓ చెప్పారు. వీఐపీతో పాటు ముగ్గురికి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి లభిస్తుందని తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని వైకుంఠం క్యాంప్లెక్స్ నుంచి 5 కిలోమీటర్ల మేర క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అంతేకాకుండా క్యూలెన్‌లో ఉండే భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రామరాజు, సీతా నిలయంలో వీఐపీలకు దర్శన వసతి ఏర్పాట్లు చేయనున్నట్టు జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు.