చంద్రబాబూ... నీకు చాకిరేవే | washermans association maha sabha | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ... నీకు చాకిరేవే

Published Sat, Oct 15 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

చంద్రబాబూ... నీకు చాకిరేవే

చంద్రబాబూ... నీకు చాకిరేవే

కంకిపాడు: రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి చాకిరేవేనని ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నూరు భాస్కరయ్య హెచ్చరించారు. శనివారం రజక వృత్తిదారుల సంఘం తూర్పు కృష్ణాజిల్లా మూడో మహాసభలను పురస్కరించుకుని కంకిపాడులో భారీ ప్రదర్శన, మార్కెట్‌యార్డులో బహిరంగ సభ నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కవరపు వెంకట రెడ్డియ్య అధ్యక్షతన జరిగిన సభలో భాస్కరయ్య మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు రజకులను మోసం చేస్తోందని ఆరోపించారు. మూడు బడ్జెట్లలో రజకులకు కేవలం రూ. 125 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల రజక కుటుంబాల్లో 75 శాతం మందికిపైగా వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. 
భద్రత కరువైన రజక మహిళలు
రజక మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నా పాలకులు పట్టించుకోవటం లేదని భాస్కరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు పెద్ద పీట వేస్తామని చెప్పుకుంటున్నారే తప్ప ఆచరణలో బీసీ వర్గంలో కూడా కనీస గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు. శీతాకాల సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు మాదిరిగా రజకుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని, రజక ఫెడరేషన్‌కు రూ వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలోనూ మేలు చేయకపోతే తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎం. రామకృష్ణ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న మరివేడు గురుశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటూరి నాగభూషణం, బాపట్ల సుబ్బారావు, కంకిపాటి వీరరాఘవయ్య, అవనిగడ్డ వెంకటేశ్వరరావు, పెడసనగంటి రంగారావు, కూడేటి సాయి, చిక్కవరపు నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement