నీళ్లు.. నిధులు | water.. funds | Sakshi
Sakshi News home page

నీళ్లు.. నిధులు

Published Mon, Aug 15 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు తదితరులు

వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు తదితరులు

  • మెతుకుసీమ సౌభాగ్యం
  • జిల్లాకు 3 నీటిపారుదల ప్రాజెక్టులు
  • రాజధాని తాగునీటికి ప్రత్యామ్నాయం
  • సింగూరు నీరు మనమే వాడుకుందాం!
  • ‘మెదక్‌’.. 3 జిల్లాలు కాబోతోంది
  • విద్య, వైద్యం, రోడ్ల మెరుగుకు పుష్కలంగా నిధులు
  • 60 టీఎంసీల సామర్ధ్యంతో మూడు ప్రాజెక్టులు మెదక్‌లోనే
  • హైదరాబాద్‌ తాగునీళ్ల నీటి అవసరాలకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నాం
  • సింగూరు నీళ్లు కూడా మనమే ఉపయోగించుకుందాం
  • మెదక్‌ను మూడు జిల్లాలుగా పునర్విభజన
  • 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
  • సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘గోదావరి పారాలి.. బీడు భూములు తడవాలి. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టుల రీడిజైన్‌ చేశారు. 50 టీఎంసీలతో మల్లన్నసాగర్‌, 7 టీఎంసీలతో కొండ పోచమ్మ, 3 టీఎంసీలతో రంగనాయక్‌ సాగర్‌ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం.

    హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక సింగూరు నీళ్లు కూడా మనకే ఉపయోగపడతాయి’అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. సోమవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగిన 70వ స్వాతంత్ర దినోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. పుష్కలంగా నీళ్లు, నిధులతో మెతుకుసీమను సౌభాగ్యసీమగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

    కొత్తగా మూడు జిల్లాలు
    ‘ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరో శుభవార్త కూడా పంచుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా సంగారెడ్డితో పాటు మెదక్, సిద్దిపేట ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు హరితహారంలో భాగం పంచుకోవటం సంతప్తి నిచ్చింది. ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటాలనే చైతన్యం రావటం సంతోషకరం.

    జిల్లాలో ఈ ఏడాది 3.43 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యమైతే.. ఇప్పటికి 2.25 కోట్ల మొక్కలు నాటాం. నాటిన మొక్కలను సంరక్షించుకోవటమూ ముఖ్యమే. బతకటానికి మనిషికి నీళ్లెంత అవసరమో, మొక్కలకూ అంతే అవసరం. అధికారులు ఎండాకాలంలో ప్రజల గొంతు ఎండకుండా ఎలాగైతే చర్యలు తీసుకున్నారో.. మొక్కల సంరక్షణకూ అలాంటి ఏర్పాట్లే చేయాలి. రాష్ట్ర స్థాయి హరితమిత్ర అవార్డుకు ఎంపికైన సిద్దిపేట మున్సిపల్‌ పాలవర్గానికి అభినందనలు.

    విద్యుత్తు మెరుగుకు రూ.800 కోట్లు
    నీటిపారుదల, విద్యుత్తు రంగాల్లో పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు బాగా సహకరిస్తున్నాయి. సంక్షేమ రంగంలో మనం సాధించిన ప్రగతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మెదక్‌ జిల్లాలో పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఈ రెండేళ్లలో రూ.800 కోట్లు ఖర్చు చేసి విద్యుత్తు అభివృద్ధి పనులు చేపట్టాం.

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ములుగులో హర్టీకల్చర్‌ యూనివర్సిటి, ఫారెస్టు కాలేజిలకు శంకుస్థాపన చేశాం. జిల్లాలో 11 మైనాన్టీ గురుకులాలను ఏర్పాటు చేశాం. అత్యంత వెనుకబడిన ఒక్క నారాయణఖేడ్‌ నియోజకవర్గానికే 4 ఎస్టీ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. మిషన్‌ కాకతీయ కింద మొదటి దశలో రూ.364 కోట్లతో 1,684 చెరువులను, రూ.454 కోట్లతో 1,679 చెరువులను బాగు చేసుకోబోతున్నట్లు ఆయన వివరించారు.

    వైద్యం, రహదారుల బాగు..
    ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణలో మన జిల్లా నెంబర్‌వన్‌గా నిలిచింది. జిల్లాలో 7 కొత్త సిమాంక్‌ కేం ద్రాలను, 3 రక్తనిధి కేంద్రాలను, 4 రక్త నిలువ కేంద్రాలను ఏర్పాటు చేశాం. రూ.3 కోట్లతో ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ఆధునిక వైద్య పరికరాలు అందించాం. రూ 1,500 కోట్లు ఖర్చు చేసి 1,600 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్డు, రూ.611 కోట్లు ఖర్చు చేసి 2,493 కిలో మీటర్ల పంచాయితీరాజ్‌ రోడ్లను బాగు చేసుకున్నాం.

    జిల్లాలో మూడు విడతల్లో 3.96 లక్షల మంది రైతులకు రూ.1,622 కోట్ల రుణమాఫీ జరిగింది’అని హరీశ్‌రావు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబుమోహన్, భూపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ రాజమణి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement