కేజీబీవీల్లో దాహం దాహం
- అల్లాడుతున్న విద్యార్థినులు, ఉద్యోగులు
- మూడు రోజులకోసారి స్నానం..దుస్తులు ఉతుక్కోవడమూ కష్టమే
- నీటి కొరతతో మరుగుదొడ్లు బంద్
హిందూపురంలోని కస్తూరిబా బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో 200 మంది విద్యార్థినులతో పాటు 15 మంది దాకా సిబ్బంది ఉన్నారు. తాగునీటి కోసం రెండు బోర్లు వేయించారు. ఒక బోరులో నీళ్లు అరకొరగా వస్తున్నాయి. మరో బోరు చెడిపోయింది. దీంతో తాగేందుకు, ఇతర అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో మునిసిపల్ ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు. ఆ నీళ్లు ఏ మాత్రమూ చాలడం లేదు. ఇలాంటి పరిస్థితే జిల్లా వ్యాప్తంగా చాలా కేజీబీవీల్లో ఉంది.
వేసవి ప్రారంభమైంది. దీంతో పాటే జిల్లాలోని చాలా కేజీబీవీల్లో నీటి కష్టాలూ మొదలయ్యాయి. జిల్లాలో 62 కేజీబీవీలు ఉన్నాయి. దాదాపు 30 చోట్ల నీటి సమస్య ఉంది. వర్షాభావం వల్ల భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో బోర్లు ఒట్టిపోతున్నాయి. అసలే ఎండాకాలం. ఒకరోజు స్నానం చేయకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఉదయం, రాత్రి రెండు పూటలా స్నానం చేసి ఉపశమనం పొందుతున్నారు. అలాంటిది నీటి కొరతతో కొన్ని కేజీబీవీల్లో మూడు రోజులకోసారి స్నానం చేయాల్సిన దుస్థితి నెలకొంది. రోజూ కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా నీళ్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. బ్రహ్మసముద్రం, కనగానపల్లి, హిందూపురం, పరిగి, తనకల్లు, కుందుర్పి, అగళి కేజీబీవీల్లో నీటి సమస్య మరీ జఠిలంగా మారింది. ఒక మనిషికి రోజుకు కనీసం 70 లీటర్ల నీరు అవసరం. అయితే కేజీబీవీల్లో విద్యార్థినులకు ఇందులో సగం కూడా అందడం లేదు. రోజూ స్నానం చేయకపోవడంతో తరగతి గదిలో చమట వాసన భరించలేకపోతున్నామని విద్యార్థినులు వాపోతున్నారు. అలాగే దుస్తులు ఉతుక్కోవడం లేదు. మాసిన దుస్తులను అలాగే వేసుకుంటున్నారు. నీటి సమస్య ఉంది కదా.. ‘సర్దుకోవాలి’ అంటూ సిబ్బంది సలహా ఇస్తున్నారు. మరి కొన్ని కేజీబీవీల్లో మరుగుదొడ్లు ఉపయోగించడం లేదు. నీరులేక అవి నిరుపయోగంగా మారాయి. విద్యార్థినులు బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోంది. ఊరి శివారు ప్రాంతాల్లో కేజీబీవీలు ఉండటంతో విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి సమస్య గురించి సంబంధిత అధికారులకు తెలిసినా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థినులు, తల్లిదండ్రులు, సిబ్బంది వాపోతున్నారు.కనీసం ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
అధిగమిస్తాం – వాణీదేవి, గర్ల్‌చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (జీసీడీఓ), సర్వశిక్షా అభియాన్
విద్యార్థినులెవరూ ఇబ్బంది పడకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాలని ఆదేశించాం. ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించాం. కేజీబీవీల్లో పర్యటించి నీటి సమస్య ఉన్నచోట అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్క విద్యార్థినీ ఇబ్బంది పడకుండా చూస్తాం.