మేం పరిశ్రమలకు కాదు, కాలుష్యానికి వ్యతిరేకం
పాలకోడేరు: మేం పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, వాటి కాలుష్యానికి మాత్రమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. సాగు, తాగునీరు కాలుష్యంపై పోరాటం చేస్తూ ప్రజాభేరి పాదయాత్ర నాల్గవ రోజు మండలంలోని వేండ్ర, మోగల్లు, పాలకోడేరు, గరగపర్రు, గొల్లలకోడేరు గ్రామాల మీదుగా మంగళవారం సాగింది. యాత్ర 14 రోజులు 16 మండలాల్లో 400 కి.మీ చేస్తూ డిసెంబర్ 9న ఏలూరు కలెక్టరేట్ వద్ద మహాధర్నా జరపనున్నామన్నారు. ఆయా గ్రామాల్లో విప్లవ వీరులు భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు, అణుశాస్త్ర వేత్త ఏఎస్‌రావు, బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయా గ్రామల ప్రజలు పాదయాత్ర నాయకులకు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. గోస్తనీ నది కాలుష్యం వల్ల మా ప్రాంత సాగు, తాగునీరు కలుషితమైపోయిందని రోగాల భారిన పడుతున్నామని పాదయాత్ర బృందం వద్ద వాపోయారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ కాలుష్యం పోరాటం చేస్తుంటే కొద్దిమంతి పెట్టుబడిదారులు మేం పరిశ్రమలకు వ్యతిరేకం అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. జిల్లాకు మరిన్ని పరిశ్రమలు రావాలని, ఉపాధి పెరగాలని ఆకాంక్షించారు. గుత్తలవారి పాలెం గోస్తనీ నది వద్ద నది ప్రక్షాళన చేయాలని నినాదాలు చేశారు. పాదయాత్రలో ఎం.రామాంజనేయులు, ఎం.శ్రీనివాస్ దళ సభ్యులు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జుత్తిగ నర్సింహమూర్తి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జేఎన్‌వీ గోపాలన్, మండల కార్యదర్శి అల్లూరి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.