సాఫ్ట్‌వేర్ రూపొందించిన చేతులు పేడ పిసుకుతున్నాయి
కీబోర్డ్‌ను రఫ్ ఆడించిన వేళ్లు తౌడు కలుపుతున్నాయి
మౌస్‌తో కబుర్లు చెప్పిన హస్తాలు గేదెలను నిమురుతున్నాయి
నిన్నటిదాకా సూటూ.. బూటు.. సెంటు
ఇప్పుడు దాణ.. గోబర్ గ్యాస్.. పాల సేకరణ
మొన్నటి దాకా అమెరికాలో ఏసీ గదుల్లో కొలువు
ప్రస్తుతం రేకుల షెడ్డులో.. చల్లని పిల్ల గాలులతో సావాసం
ఇంతకీ వీరెవరు? సాఫ్ట్‌వేర్ రంగం వదిలి
డెయిరీ రంగంలోకి ఎందుకు వచ్చారు?
ద్రోణాదుల(మార్టూరు),న్యూస్‌లైన్: ‘ఎంఏలు చేశాం.. ఎంబీఏలు చేశాం.. బీటెక్..సీఏలు చేశాం.. బీఈడీలు పూర్తి చేశాం. అయినా మా చదువుకు తగ్గ ఉద్యోగం లభించలేదు. గవర్నమెంటు ఉద్యోగాల సంగతి పక్కన పెడితే, కనీసం ప్రైవేటు ఉద్యోగాలు కూడా దొరకలేదు. కన్నవారికి..నమ్ముకున్నవారికి ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నాం’.. ఇలా నేటి రోజుల్లో చాలామంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉన్నత చదువులు చదివి.. ఆ చట్రం నుంచి బయటపడలేకపోతున్నారు. ఫలితంగా విలువైన సమయాన్ని వృథా చేసుకుంటూ.. పరనిందలతో కాలం గడుపుతున్నారు. ఇలాంటివారు ద్రోణాదులకు చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కథ చదవాల్సిందే.. చదివిన చదువుకు చేస్తున్న పనికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఉపాధి ఎలా కల్పించుకోవచ్చో తెలుసుకోవాల్సిందే..
... ... ...
పెంట్యాల రామారావు ఎంసీఏ పూర్తి చేసి.. 1997లో అమెరికా పయనమయ్యారు. సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడి.. సైబర్‌సాఫ్ట్ అనే సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీ ప్రారంభించారు. 2008 వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకొని అక్కడ నుంచి వ్యాపార లావాదేవీలు ప్రారంభించారు. అవసరమైనప్పుడు అమెరికా వెళ్లి వస్తుండేవారు. ఈ నేపథ్యంలో స్వగ్రామం నిత్యం ఆయనకు గుర్తుకొస్తుండేది. ‘నేను ఎక్కడ పుట్టాను.. ఏం చేస్తున్నాను’ అన్న ఆలోచన వచ్చిన వెంటనే తన స్వగ్రామానికి ఏదైనా చేయాలనుకున్నారు. వ్యవసాయ కుటుంబం కావడంతో దానికి సంబంధించిన పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న తమ్ముడు పెంట్యాల ఉమామహ్వేరరావుని పిలిపించారు. తన ఆలోచన చెప్పారు. ఇద్దరూ కలిసి డెయిరీ ఫాం ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. దీనికి వారి తండ్రి మదన్‌మోహనరావు కూడా అంగీకరించడంతో మూడు నెలల క్రితం ఆ ఏర్పాట్లు ప్రారంభించారు.
నిర్మాణం ఇలా..
ఫాం కోసం 4 ఎకరాలు సేకరించారు. రూ. 60 లక్షలతో షెడ్డు నిర్మించారు. హర్యానా, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి 250 గేదలను గ్రామానికి తరలించారు. ఒక్కో గేదకు రూ. 70 వేలు ఖర్చు చేశారు. వాటిలో నలభై పాడి గేదలు కాగా.. మిగిలినవి సూడు గేదెలు. పూటకు 160 లీటర్లు సేకరిస్తూ గ్రామస్తులకే విక్రయిస్తున్నారు.
సాంకేతిక పద్ధతులు
పెద్ద సంఖ్యలో ఉన్న పశువులను సంరక్షించేందుకు ఎక్కువమంది కూలీలు కావాలి. పైగా బోలెడంత సమయం వృథా అవుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు *12 లక్షలతో మేత మిక్చర్‌ను కొనుగోలు చేశారు. ఈ యంత్రమే మేతను సిద్ధం చేస్తుంది. రకరకాల దాణాలను కూడా తయారు చేస్తుంది. అలాగే పాలు పిండే యంత్రాన్నీ కొనుగోలు చేశారు. ప్రస్తుతానికి15 మంది కూలీలు డెయిరీ ఫాంలో పనిచేస్తున్నారు. గేదెలన్నీ పాడి దశకు చేరుకుంటే మరికొంతమందికి ఉపాధి దొరుకుతుంది.
విద్యుత్ ఉత్పత్తి కూడా..
గేదెల నుంచి వస్తున్న పేడను కూడా ఈ సోదరులు వృథా కానివ్వడంలేదు. గోబర్ గ్యాస్ ప్లాంట్ నిర్మించి.. దాని ద్వారా ఫాంకు అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
స్వచ్ఛమైన పాలు అందించటమే లక్ష్యం : రామారావు
గ్రామీణులకు స్వచ్ఛమైన పాలు అందించడమే మా లక్ష్యం. సాఫ్ట్‌వేర్ రంగంలో దొరకని తృప్తి ఇక్కడ లభిస్తోంది. 1000 గేదలతో ఫాం అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇండస్‌ఫ్రెష్ అనే పేరుతో పాలను ప్యాకింగ్ చేసి ఎలాంటి రసాయనాలు కలపని, నిల్వలేని పాలను త్వరలో అందిస్తాం.
వ్యవసాయ రంగమే ఇష్టం : ఉమామహేశ్వరరావు
మాది వ్యవసాయాధారిత కుటుంబం. సొంత గ్రామంలో వ్యవసాయ అనుబంధ రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాం. ఉన్నత చదువులు చదివి వ్యవసాయం చేయడం తప్పు ఎలా అవుతుంది?
కొడుకుల నిర్ణయం భేష్ : మదనమోహనరావు
నేలతల్లిని నమ్ముకుని ఇద్దరి కొడుకుల్ని కష్టపడి చదివించా. వారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేశారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత సొంత పొలంలో డెయిరీ ఫాం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. చదువంటే పక్కనున్న వాళ్లకీ బువ్వ పెట్టగలగాలి.
‘కంప్యూటర్లు వద్దు..పాలే ముద్దు’
Published Sun, Feb 23 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM
Advertisement