ఇలా అయితే భద్రత ఎలా?
* డీజిల్ లోకో పైలెట్‌తో ఏసీ ఇంజన్లు షంటింగ్
* అరకొరగా ఉన్న షంటింగ్ సిబ్బందిపై పనిభారం
* గుంటూరు రైల్వే డివిజన్ పరిస్థితి ఇదీ!
గుంటూరు (నగరంపాలెం): రైల్వేలో సేఫ్టీ (భద్రత)కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న డివిజన్ అధికారుల మాటలు కార్యరూపం దాల్చటం లేదు. అరకొర సిబ్బంది, ఒకరు చేయాల్సిన పనిని వేరొకరితో చేయించడం ఇలాంటి సమస్యలతో ఇక సేఫ్టీ ఎక్కడ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్టేషన్‌లోకి వచ్చిన రైలుకు ఇంజన్ మార్చడం, బోగీలను సైడింగ్ చేయటం, కోచ్ ఫిట్‌లకు బోగీలు తరలించటం కోసం ప్రతి స్టేషన్‌లో షంటర్లు (డైవర్లు) ఉంటారు. డీజిల్ ఇంజన్‌కు డీజిల్ లోకో పైలెట్‌లు, ఎలక్ట్రికల్ ఇంజన్‌లకు ఎసీ లోకో పైలెట్‌లు ఉంటారు. డివిజనులో ప్రయాణికుల రైళ్ళకు గుంటూరు రైల్వేస్టేషన్‌లో, గూడ్స్ రైళ్ళకు నల్లపాడు రైల్వేస్టేషన్‌లో షంటర్లు ఉంటారు. తెనాలి, మంగళగిరి వైపునకు కొద్ది దూరం మినహా అన్ని ప్రాంతాలకు డీజిల్ ఇంజన్‌లు ద్వారా రైళ్ళు నడపటంతో డివిజనులో ఎలక్ట్రికల్ లోకో పైలెట్‌లను నియమించలేదు. డివిజను ప్రారంభించిన తర్వాత నాలుగు సంవత్సరాల వరకు విజయవాడ డివిజనుకు చెందిన ఎసీ లోకో పైలెట్‌లే గుంటూరు, నల్లపాడు రైల్వేస్టేషన్‌లలో షంటర్లుగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం డివిజనులో కొంత మంది డీజిల్ లోకో పైలెట్‌లకు ఎసీ ఇంజన్ పై స్వల్పకాలిక శిక్షణ అందించి వారినే షంటర్లుగా నియమించారు. రైల్వే నిబంధనల ప్రకారం లోకో పైలెట్ డీజిల్ లేదా ఎసీ ఇంజన్‌లో ఒక దానినే నడపాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం షంటర్లుతో డీజిల్, ఎసీ ఇంజన్‌లు నడిపిస్తున్నారు. ఆపరేటింగ్ సిస్టంలో పూర్తి విరుద్ధంగా ఉన్న ఇంజన్‌లు వెంట వెంటనే నడపాల్సి రావటంతో వారు తీవ్ర మానసిక అందోళనకు గురి అవుతున్నారు. ఇది భద్రత పరంగా అంత శ్రేయస్సుకారం కాదని, పొరపాటున ఒత్తిడికి గురై లోకోపైలెట్ తప్పు చేస్తే భారీ నష్టం జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అరకొరగా షంటింగ్ సిబ్బంది..
డివిజనులో గుంటూరు రైల్వేస్టేషన్‌లో షిఫ్టుకు ముగ్గురు, నల్లపాడు రైల్వేస్టేషన్‌లో షిఫ్టుకు ఇద్దరు చొప్పున మూడు షిఫ్టులకు కలిపి 15 మంది, వీక్ ఆఫ్‌కు ,సెలవు రిజర్వుకు 11 మొత్తం 26 మంది షంటర్లు కావల్సి ఉండగా కేవలం 17 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో ప్రతిరోజు 20 రైళ్ళకు ఇంజన్లు మార్చటం, సైడింగ్ చేయటం, కోచ్‌పిట్‌లో బోగీలను తరలించటం, ప్లాట్‌ఫాం మీద ఫార్మేషన్ చేయటం , నల్లపాడులో ప్రతిరోజు 26 గూడ్స్ రైళ్ళకు ఇంజన్లు మార్చటం, ఫార్మేషన్ చేయటం వలన అధిక పనిభారం ఉంది. ఇక ఎసీ ఎలక్ట్రికల్ ఇంజన్‌లు సైతం షంటింగ్ చేయటం మరింత ఒత్తిడికి గురి చేస్తుంది. ఇక ప్రత్యేక సర్వీసులు నడిపితే నిబంధనలకు విరుద్ధంగా అసిస్టెంట్ లోకో పైలెట్‌లతో సైతం ఇంజన్‌ల షంటింగ్ విధులు చేయిస్తున్నారు. డివిజనులో ఎసీ లోకో పైలెట్ పోస్టులు లేని కారణంగా పైలెట్‌లకు తరచు స్కిల్ డెవలప్‌మెంట్‌కు సూచనలు ఇచ్చే ఎసీ లోకో ఇన్‌స్పెక్టర్‌ను సైతం నియమించ లేదు. దీనితో స్వల్పకాలిక శిక్షణ మినహా ఎసీ లోకో పైలెట్‌లకు సామర్థ్యం మెరుగుపరుచుకోవటానికి అవకాశం లేకుండా పోతుంది. డివిజనులో భద్రత దృష్ట్యా వెంటనే ఎసీ లోకో పైలెట్ పోస్టులు ఏర్పాటు చేయాలని యూనియన్ నాయకులు సైతం డీఆర్‌ఎం దృష్టికి తీసుకొచ్చారు.