రూ.5 వేలు ఇస్తే ఏం చేసుకుంటాం..?
బ్యాంకు అధికారుల తీరుకు నిరసనగా
ఖాతాదారుల రాస్తారోకో
కోటగిరి(బాన్సువాడ): తమ డబ్బులు ఇవ్వాలని బ్యాంకుకు వెళ్తే అధికారులు కేవలం రూ.5వేలు ఇస్తున్నారని, వాటితో ఏంచేయాలో తోచడంలేదని మంగళవారం కోటగిరిలో ఖాతాదారులు రాస్తారోకో చేశారు. తమకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని వేడుకుంటున్నప్పటికీ రోజుకు రూ.5 వేలకంటే ఎక్కువ ఇవ్వలేమని అధికారులు చెప్పడంతో తీవ్ర ఇబ్బంది పడుతన్నామని చెప్పారు.
ఏటీఎంలకు వెళ్తే ఏటీఎంలో డబ్బులుండవని, బ్యాంకుకు వస్తే రూ. 5 వేలకంటె ఎక్కువ ఇవ్వడం కుదరదని అధికారులు చెబుతున్నారని మండిపడ్డారు. తాము బ్యాంకుల్లో 4 నుంచి 5 లక్షల వరకు డిపాజిట్ చేశామని డబ్బులివ్వకపోతే మా గతి ఎట్లా అని మరికొందరు ఖాతాదారులు ప్రశ్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బ్యాంకు అధికారులతో మాట్లాడారు. దీంతో బ్యాంకు మేనేజర్ జోషిప్రకాశ్ అక్కడికి చేరుకొని ఖాతాదారులతో మాట్లాడారు. శుభకార్యాలు జరిపే వారికి రోజుకు రూ. 50 వేల వరకు ఇచ్చేందుకు యత్నిస్తామన్నారు.
ఈవిషయం ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. దీంతో ఖాతాదారులు రాస్తారోకో విరమించారు. కాగా రుద్రూర్ మండల కేంద్రంలోని సిండికేట్ బ్యాంకు క్యాషియార్‌పై ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రవర్తన ఏమీ బాగులేదని, డబ్బులు కట్టడానికి బ్యాంకుకు వెళ్తే ఖాతాదారులపై దుర్భాషలాడుతున్నారని డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.