ప్లాస్టిక్‌ పైసా కథేంటి? | What is the story of plastic money | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ పైసా కథేంటి?

Published Fri, Dec 9 2016 10:41 PM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

ప్లాస్టిక్‌ పైసా కథేంటి? - Sakshi

ప్లాస్టిక్‌ పైసా కథేంటి?

మనదేశం ప్లాస్టిక్‌ కరెన్సీని వినియోగంలోకి తెచ్చేందుకు ఇప్పుడు చర్యలు ప్రారంభించింది. రూ.10 ముఖ విలువ కలిగిన వంద కోట్ల నోట్లను ప్రయోగాత్మకంగా ఐదు నగరాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అసలు ప్లాస్టిక్‌ కరెన్సీ వినియోగం ఎప్పుడు మొదలైంది..? దీని వల్ల ఉన్న ఉపయోగాలు ఏమిటీ..? ప్లాస్టిక్‌ కరెన్సీకి ఉన్న ప్రతికూలతలు ఏమిటో? ఒకసారి చూద్దాం..    – సాక్షి, తెలంగాణ డెస్క్‌

అడుగు వేసింది ఆసీస్‌లో..
► ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్లను మొట్టమొదటగా అందుబాటులోకి తెచ్చిన దేశం ఆస్ట్రేలియా. 1988లో ఆస్ట్రేలియా ప్లాస్టిక్‌ నోట్లను వినియోగంలోకి తెచ్చింది. ప్రస్తుతం 5 ఆస్ట్రేలియా డాలర్ల ముఖ విలువతో కొత్త సిరీస్‌ నోట్లను విడుదల చేసేందుకు ఆ దేశం సిద్ధమైంది.
► ప్రస్తుతం 20కిపైగా దేశాలు ప్లాస్టిక్‌ కరెన్సీని వినియోగిస్తున్నాయి. ఇందులో ఆస్ట్రేలియాతో పాటు కెనడా, ఫిజీ, మారిషస్, న్యూజిలాండ్, పాపువా న్యూగినియా, రుమేనియా, వియత్నాం, బ్రిటన్‌ పాలీమర్‌ కరెన్సీని వాడుతున్నాయి.
► బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా 2011లో నిర్వహించిన సర్వే ప్రకారం.. పాలీమర్‌ నోట్ల వల్ల భూతాపం 32 శాతం తగ్గుతుందని, అలాగే కాగితపు నోట్లతో పోలిస్తే ఎనర్జీ డిమాండ్‌ 30 శాతం తక్కువగా ఉంటుందని వెల్లడించింది.
► వాతావరణ మార్పులకు సంబంధించి కుదిరిన పారిస్‌ ఒప్పందం ప్రకారం.. అనేక దేశాలు ఇప్పుడు పాలీమర్‌ నోట్లను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
► మూడేళ్ల అధ్యయనం అనంతరం బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొత్త 5 ముఖ విలువ కలిగిన యూరోను విడుదల చేసింది.

లాభాలేంటి..
► భద్రతా ప్రమాణాలను సులువుగా పరిశీలించవచ్చు. నకిలీలను సృష్టించడం కష్టం.
► కాగితపు నోట్లతో పోలిస్తే పాలీమర్‌ నోట్ల జీవిత కాలం 2.5 రెట్లు ఎక్కువ. దీని వల్ల రీప్లేస్‌మెంట్‌ ఖర్చు తగ్గుతుంది.
► మన్నిక ఎక్కువ కావడం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం తక్కువ.
► పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌.. మట్టి, తడి అంటవు కాబట్టీ శుభ్రంగా ఉంటాయి.

నష్టాలేంటి..
► కాగితం నోట్లతో పోలిస్తే వీటిని ముట్టుకుంటే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. జారిపోయే గుణం వల్ల వీటిని లెక్కించడం కాస్త కష్టం.
► ప్లాస్టిక్‌ కరెన్సీ ఉత్పత్తి వ్యయం ఎక్కువ
► మడత పెట్టేందుకు అవకాశం ఉండదు.
► ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆటోమాటిక్‌ పేమెంట్, వెండింగ్‌ మెషీన్లకు ఎంత వరకు అనుకూలం అనే దానిపై స్పష్టత లేదు.

ప్లాస్టిక్‌తో కరెన్సీ ఎలా..
కాగితపు కరెన్సీని పత్తి, చెట్ల కలప, కొన్ని రసాయన పదార్థాలను వాడి ముద్రిస్తున్నారు. భద్రతాపరమైన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. వీటికి నకిలీల బెడద తప్పడం లేదు. పైగా వీటి జీవితకాలం తక్కువ.. అలాగే ఉత్పత్తి వ్యయం ఎక్కువ. అయితే ప్లాస్టిక్‌ నోట్ల తయారీకి బయాక్సియల్‌ ఓరియంటెడ్‌ పొలిపైలీన్‌(బీఓపీపీ) అనే రసాయనాన్ని వినియోగిస్తారు. ఇది ప్లాస్టిక్‌లోని ఒకరకం. ప్లాస్టిక్‌ లేదా పాలీమర్‌తో రూపొందిస్తారు కాబట్టీ వీటిని ప్లాస్టిక్‌ మనీగా పిలుస్తున్నారు. వీటి తయారీలో సహజ వనరులైన కలప లేదా పత్తి వాడకం ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement