తొమ్మిది నెలలుగా అందని డబ్బులు
14 వేల రైతులకు రూ. 5 కోట్లపైగా బకాయిలు
నాగిరెడ్డిపేట : పాడి రైతులను ప్రోత్సహించడానికి ప్రతి లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకాన్ని అందిస్తామన్న సర్కారు.. నెలల తరబడి ఆ మొత్తాన్ని అందించడం లేదు. తొమ్మిది నెలల తర్వాత ఇటీవల ఐదు నెలలకు సంబంధించిన బకాయిలను మంజూరు చేసినా.. అవి ఇప్పటికీ రైతుల ఖాతాల్లో చేరలేదు. ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో 14వేల మంది పాడిరైతులు విజయడెయిరీ కేంద్రాల్లో పాలు పోస్తున్నారు. రైతులు రోజూ 70 వేల లీటర్ల వరకు పాలను విక్రయిస్తున్నారు. పాలను విక్రయించే రైతులకు వెన్నశాతం ఆధారంగా ధర చెల్లిస్తారు. విజయ డెయిరీ కనీసం 5 శాతం వెన్న ఉంటేనే పాలను కొనుగోలు చేస్తుంది. వెన్న శాతం ఆధారంగా ఒక్కో రైతుకు లీటర్ పాలకు రూ. 27 నుంచి రూ. 55 వరకు ధర చెల్లిస్తోంది. పాడి రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పాల ధరకు అదనంగా లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. దీనివల్ల చాలామంది పాలను ప్రైవేట్ డెయిరీలలో కాకుండా విజయ డెయిరీలోనే విక్రయిస్తున్నారు.
అయితే రైతులకు గతేడాది ఏప్రిల్‌నుంచి ఈ ప్రోత్సాహకం అందడం లేదు. ఇటీవల ఐదు నెలలకు సంబంధించిన ప్రోత్సాహకాన్ని మంజూరైందని డెయిరీ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ. 2.31 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. ఇంకా సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు రూ. 3 కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉందని తెలిపారు. ప్రోత్సాహకాన్ని వెంటనే మంజూరు చేయాలని పాడి రైతులు కోరుతున్నారు. నెలల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా బిల్లులతో కలిపి ప్రోత్సాహకాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతుల ఖాతాల్లో జమ చేస్తాం
విజయ డెయిరీలో పాలను విక్రయించే రైతులకు ప్రభుత్వం లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ప్రోత్సాహకం మంజూరైంది. వీటిని రెండు, మూడురోజుల్లో పాడిరైతుల ఖాతాల్లో జమ చేస్తాం. మిగిలిన నిధులు ప్రభుత్వం నుంచి రాగానే రైతుల ఖాతాల్లో వేస్తాం. – ప్రదీప్, మేనేజర్, విజయ డెయిరీ, కామారెడ్డి
పాడి రైతుకు ప్రోత్సాహకమేది?
Published Tue, Jan 3 2017 1:25 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
Advertisement