కొత్త విద్యాశాఖాధికారి ఎవరో?
– 31న డీఈఓ అంజయ్య ఉద్యోగ విరమణ
– తెరపైకి పలువురు అధికారుల పేర్లు
– ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా విద్యాశాఖ అధికారి కె. అంజయ్య ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. నూతన డీఈఓ ఎవరనేదానిపై ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కీలకమైన విద్యాశాఖ అధికారి స్థానం కోసం పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) పదోన్నతి జాబితాలో అంజయ్య ఉన్నారు. ఇప్పటికే డిపార్టుమెంట్ పదోన్నతుల కమిటీ (డీపీసీ) సమావేశం జరిగి ఉంటే పదోన్నతులు వచ్చేవని తెలిసింది. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర కార్యాలయం విజయవాడకు బదిలీ కావడంతో అంతా హడావుడిగా ఉన్నారు.
ఈ కారణంగానే డీపీసీ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఏక్షణానైనా డీపీసీ సమావేశం జరగవచ్చని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే డీఈఓ అంజయ్యకు రిటైర్డ్ అయ్యే రెండు రోజుల ముందైనా పదోన్నతి రావచ్చు. అలాగే పలువురు డెప్యూటీ డీఈఓలు, అసిస్టెంట్ డైరెక్టర్లకు డీఈఓలుగా పదోన్నతులు వస్తాయి. ఈ క్రమంలో కష్ణా జిల్లాలో ఏడీగా పని చేస్తున్న ఓ అధికారి పదోన్నతిపై ఇక్కడికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. గతంలో ఇన్‌చార్జ్ డీఈఓగా పని చేసిన అనుభవంతో శామ్యూల్ కూడా తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈయన ప్రస్తుతం మదనపల్లి డెప్యూటీ డీఈఓగా పని చేస్తున్నారు. పదోన్నతులు కల్పించేందుకు ఏసీఆర్ (యానివల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్)ను ప్రభుత్వం కోరింది. డీఈఓల ఏసీఆర్ కలెక్టర్లు, డెప్యూటీ డీఈఓలు, ఏడీల ఏసీఆర్‌లు డీఈఓలు ఇవ్వాల్సి ఉంది. అయితే రెండేళ్ల రిపోర్టు అడిగినా కనీసం ఏడాది రిపోర్ట్‌లైనా పంపాలని సూచించినట్లు తెలిసింది.
పదోన్నతులు రాకపోతే ఏడీకి ఇన్‌చార్జ్?
నెలాఖరులోగా విద్యాశాఖలో పదోన్నతులు జరగకపోతే డీఈఓ అంజయ్య రిటైర్డ్ అయిన అనంతరం ఏడీగా పని చేస్తున్న పగడాల లక్ష్మీనారాయణను కొద్దిరోజులు ఇన్‌చార్జ్‌గా నియమించే అవకాశం ఉంది. వచ్చే నెలలో కచ్చితంగా డీపీసీ జరిగే అవకాశాలు ఉన్నాయి. డీపీసీ జరిగి రెగ్యులర్ డీఈఓను నియమించే దాకా లక్ష్మీనారాయణను కొనసాగించే అవకాశమూ ఉంది. మరోవైపు చిత్తూరు డీఈఓగా పని చేస్తున్న నాగేశ్వరరావు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. డైరెక్టరేట్ కార్యాలయంలో డీఈఓ హోదాలో పని చేస్తున్న ఓ అధికారి కూడా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ ఉత్కంఠకు తెర పడాలంటే మరో 15 రోజులు వేచి చూడాల్సిందే.