ప్రజా అవసరాలపై ఎందుకు చర్చించరు
Published Mon, Aug 22 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
– వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రజా అవసరాలపై రాష్ట్ర కేబినెట్ ఎందుకు చర్చించదని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామిక రాయితీలు, రుణమాఫీ, పోలవరం నిర్మాణం వంటి అంశాలపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రుణమాఫీ హామీతో రైతులు విష వలయంలో చిక్కుకున్నారని, వారికి బ్యాంకులూ రుణాలివ్వడం లేదన్నారు. వర్షాభావం, కరువు కారణంగా 13 జిల్లాల్లో పంటలు ఎండుతున్నాయన్నారు. తూర్పు గోదావరిలోని కొన్ని మండలాల్లో క్రాప్ హాలిడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. నదీ నీటి పంపకాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి సంజీవని లాంటిదైనా ఈసారి బడ్జెట్‌లో కేంద్రం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణమని విమర్శించారు. వీటన్నింటికి కర్త, కర్మ, క్రియ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
Advertisement