సీఎం సాయం చేయకపోతే ఇక్కడే చనిపోతా
సాక్షి, విజయవాడ బ్యూరో: నెల రోజుల నుంచి ముఖ్యమంత్రిని కలవాలని తిరుగుతున్నా అనుమతించడం లేదని, క్యాంపు కార్యాలయం లోపలికి పంపేదాకా ఇక్కడే ఉంటానని ఒక మహిళ ఆందోళనకు దిగింది. గుంటూరుకు చెందిన జె.పద్మావతి సోమవారం ఉదయం సీఎం చంద్రబాబును కలవడానికి క్యాంపు కార్యాలయానికి రాగా ఆమెను సెక్యూరిటీ సిబ్బంది ప్రధాన గేటు వద్దే నిలిపివేశారు. తన పరిస్థితిని వివరించి లోనికి పంపించాలని కోరగా, వినతిపత్రం ఇవ్వాలని, దాన్ని పరిశీలించిన తర్వాత పంపుతామని సిబ్బంది బదులిచ్చారు. రోజూ ఇదే మాట చెబుతున్నారని, ఈరోజు ఎలాగైనా సీఎంను కలవాల్సిందేనని పద్మావతి పట్టుబట్టింది. అయినా సెక్యూరిటీ సిబ్బంది లోనికి పంపకపోవడంతో బోరున విలపిస్తూ అక్కడే రోడ్డుపై తన ముగ్గురు పిల్లలతో కలిసి బైఠాయించింది.
ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న తనకు జీతం సరిపోక ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని, ఇల్లు గడవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తున్న తన భర్త కొద్దిరోజుల క్రితం కిడ్నీ వ్యాధితో చనిపోయాడని, అప్పటి నుంచి అధికారులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని, తనకు వితంతు పింఛన్ కూడా ఇవ్వలేదని చెప్పింది. పీజీ చదివిన తాను సిగ్గు విడిచి ముగ్గురు పిల్లలతో కలిసి సీఎంను కలవడానికి వస్తే అనుమతించడం లేదని వాపోయింది. తనకు ఇల్లు, చిన్న ఉద్యోగం ఇప్పించాలని కోరింది. ముఖ్యమంత్రి సాయం చేయకపోతే తాను ఇక్కడే చనిపోతానని విలపిస్తూ చెప్పింది. సందర్శకులను ముఖ్యమంత్రి కలవరని చెప్పిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను లోనికి పంపించలేదు. సీఎంను కలిసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన చాలామందిని లోనికి అనుమతించలేదు.