మంగపేట(జయశంకర్ భూపాలపల్లి జిల్లా): మంగపేట మండలం చుంచుపల్లి గ్రామంలో ప్రాథమిక ఆసుపత్రిలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న కుర్సం రమాదేవి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. స్థానిక ఎస్ఐ మహేందర్ వేధింపులే కారణమని సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఆమె కుమారుడు శ్రీకాంత్ మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు. ఈ విషయం తనకు తెలియదు అని చెబుతున్నా వినకుండా, అమ్మాయి తరపు వారు కేసు పెట్టడంతో పలుమార్లు ఆమెని పిలిపించి ఎస్ఐ వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది.
గురువారం ఉదయం చుంచుపల్లి ఆసుపత్రికి ఎస్.ఐ వచ్చి తోటి ఏఎన్‌ఎంల ముందు అసభ్యకరంగా మాట్లాడుతూ నీ ఉద్యోగం తీయించి నీ పై కేసు నమోదు చేస్తానని బెదిరించాడు. నీ కొడుకును నువ్వే దాచిపెట్టావు.. మర్యాదగా స్టేషన్ కు వచ్చి కలవమని హెచ్చరించారు. భయభ్రాంతులకు గురైన రమాదేవి మంగపేట పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా తన తోటి ఏఎన్‌ఎం జమునను వెంట తీసుకుని ఏటూరునాగారం సీఐను కలిసింది. సీఐ తన విధినిర్వహణలో బిజీగా ఉండటంతో కలవలేకపోయారు.
దీంతో భయానికి గురైన రమాదేవి తన తోటి ఏఎన్‌ఎంకు ఫోన్ చేసి నాకు భయమేస్తుంది బ్రతకాలని లేదు నేను చనిపోతున్నా అని ఫోన్ పెట్టేసింది. పది నిమిషాల తరువాత రమాదేవి పురుగుల మందు తాగిందని తోటి ఏఎన్‌ఎంలకు ఫోన్ రావడంతో అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ఏటూరునాగారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికత్స పొందుతున్న రమాదేవి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని 24 గంటల వరకు అబ్జర్వేషన్‌లో ఉండాలని వైద్యులు తెలిపారు. వేధింపులకు గురి చేస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకుని రమాదేవికి న్యాయం జరిగేలా చేయాలని జయశంకర్ జిల్లా సెకండ్ ఏఎన్‌ఎంల అధ్యక్షురాలు జమున కోరారు.
ఎస్ఐ వేధింపులు,మహిళ ఆత్మహత్యాయత్నం
Published Fri, Jun 23 2017 5:09 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
Advertisement
Advertisement